TT Ads

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కల్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా సేనాని చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. పొత్తుల ప్రకటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

టీడీపీ-జనసేన కలయికతో 2014 ఎన్నికలు రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నిజానికి, టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం కొంత‌కాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ప్రకటించిన సందర్భం కూడా సరిగ్గా సరిపోయింది. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో అధికార వైసీపీ ఆలోచనలో పడింది. ఈ పొత్తులతో అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ పెద్దల్లో భయాందోళన మొదలైందట. అందుకే ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి.. ఏం మాట్లాడాలో తెలియక, ఇష్టానుసారంగా వాగేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే బాలకృష్ణ పొత్తు ఉంటుందన్నారు.మ‌రోవైపు పొత్తుపై టీడీపీ, జ‌న‌సేన ఆశాభావంతో ఉన్నా, బీజేపీ హైకమాండ్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటుందోన‌న్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెల‌కొంది.

టీడీపీ అధినేత, మాజీ సీఏం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాబు అక్రమ అరెస్టును తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు.. పలు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు.. దేశ విదేశాల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా బాబు అరెస్టుపై నిరసన జ్వాలలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో.. చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. ఆ వెంటనే టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని, కలిసే బరిలోకి దిగుతామని ప‌వ‌న్ ప్రకటించడం పెను సంచలనంగా మారింది.

మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హస్తిన పర్యటనకు వెళ్లడం.. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలే. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం ఎందుకో మౌనం పాటిస్తున్నారు..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు .. సొంత పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే.. ఏదో అనుకొని సీఎం లండన్ పర్యటనకు వెళ్లడం ఇక్కడేమో పరిస్థితులు మారిపోవడం.. వచ్చీరాగానే ఏపీలో వాతావరణం చూసి కంగుతిన్నారట.

చంద్రబాబుతో ములాఖత్ తర్వాత బాలయ్య మీడియా ముందుకొచ్చారు. . ‘ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ అక్రమ కేసులకు భయపడాల్సింది మేము కాదు.. వైసీపీ నేతలే. మేము బలహీనపడుతున్నాం అని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇంకా బలపడుతున్నాం అన్నారు బాల‌య్య‌. రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించాం. మళ్లీ చెబుతున్నా.. ఏపీ ప్రజల కోసం యుద్ధం చేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా ఈ యుద్ధంలో కలవటం శుభపరిణామం. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. మసిపూసి మారేడు చేయాలని వైసీపీ చూస్తోంది. జగన్ ముఖ్యమంత్రి కావటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం’ అని బాలయ్య విరుచుకుప‌డ్డారు.

రెండు పార్టీల మధ్య పొత్తులు ఏర్పడినప్పుడు రెండు పార్టీల సానుభూతిపరుల ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా అన్న సందేహం ఉంటుంది. ఎందుకంటే.. ఓ పార్టీ అంటే మరో పార్టీ సానుభూతిపరుడికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇతర కారణాలు ఉండవచ్చు. . అదే సమయంలో టీడీపీకి కూడా. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు కానీ.. సొంత అభిప్రాయాలకు కాదని చెబుతూంటారు. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతల వైఖరి రెండు పార్టీలకు కలిసి వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని కొంత కాలంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన తన వారాహి యాత్రను కూడా జనసేన పార్టీ బలంగా ఉందనుకున్న ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. టీడీపీ నేతలు రెండు వైపుల నుంచి యాత్రలు చేశారు. లోకేష్ పాదయాత్ర.. చంద్రబాబు టూర్లు అన్నీ కలిసి ఎటు వైపు చూసినా టీడీపీ అన్న వాతావరణం కల్పించాయి. పవన్ యాత్రకు సైతం జనం పోటెత్తడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఊహించనంతగా ఉందని.. కలిసి పోటీ చేస్తే తిరుగులేని విజయం వస్తుందన్న అభిప్రాయానికి ఆయా పార్టీలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీచేయడం వల్ల అధికార పార్టీ వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లు వైసీపీ కంటే అధికంగా ఉన్నాయని పలువురు లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 73,207 ఓట్లు వస్తే.. టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల అటు టీడీపీ, ఇటు జనసేన ఓడిపోవడంతో పాటు వైసీపీ తరఫున అమర్నాథ్‌రెడ్డి సుమారు 8 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. ఇదే పరిస్థితి పలు నియోజకవర్గాల్లో నెలకొంది. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి 66,141 ఓట్లు, టీడీపీకి 60,290 ఓట్లు, జనసేనకు 18,807 ఓట్లు పోలయ్యాయి. దీంతో పేర్ని నాని విజయం సాధించారు.

అటు నగరి నియోజకవర్గంలో వైసీపీకి 80,333 ఓట్లు, టీడీపీకి 77,625 ఓట్లు వచ్చాయి. పొత్తు కారణంగా ఇక్కడి సీటును జనసేన పార్టీ బీఎస్పీకి కేటాయించింది. చివరకు 2,708 ఓట్ల మెజారిటీతో రోజా గెలిచారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 1,05,063 ఓట్లు, టీడీపీకి 84,187 ఓట్లు, జనసేనకు 9,279 ఓట్లు వచ్చాయి. దీంతో అంబటి రాంబాబు విజయం సాధించారు. తణుకు, శ్రీకాకుళం, భీమిలి, అమలాపురం, పెడన, భీమవరం, తాడేపల్లి గూడెం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో కూడా స్వల్ప మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని పవన్ ప్రకటనచేసిన మరుసటి క్షణం నుంచే.. ఆ విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి..? జనాల్లోకి వెళ్లకుండా ,సోషల్ మీడియాలో చర్చ జరగకుండా చేయాల్సిన కుట్రలు, కుతంత్రలు అన్నీ వైసీపీ పన్నింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అటు జనసేన.. ఇటు టీడీపీ పై ఏదో ఒక విధంగా బురద చ‌ల్లాలని ప్లాన్ చేసిన వైసీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో మ‌రి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. .దీనిపై టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. ఇక మీమ్స్‌కు అయితే కొదువే లేదు. మున్ముందు.. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక, రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు షురూ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఉద్యోగ వర్గాలను పూర్తిగా దూరం చేసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో యువత కూడా దూరమయ్యారని అంటున్నారు. జాబ్ క్యాలెండ్ పేరుతో మోసం చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ క్యాడర్ కూడా తమకు ప్రాధాన్యత లేదని .. ఖర్చులు పెట్టుకున్నా బిల్లులు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ఈ అసంతృప్తి ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యేలా టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. అయితే.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాబట్టే జగన్ భయపడి ముందుకెళ్లలేకపోతున్నారనే కామెంట్స్ సర్వత్రా వస్తున్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు సరే.. రేపొద్దున 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి..? అవన్నీ ఇప్పుడు కళ్ల ముందు కనిపించాయి కాబట్టే.. ఇకదీన్ని మరింత సీన్‌లా క్రియేట్ చేయడం అనవసరం అని.. అసలే ఏపీలో ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం ముందడుగేసినా.. మాట్లాడినా కథ వేరేలా ఉంటుందని గ్రహించే ఇలా మిన్నకుండిపోయారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *