TT Ads

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో.. అధినేత కనికరిస్తారేమో అని ఎదురుచూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్కచూపులు చూస్తున్నారు… తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తున్న నేతలు- కారు దిగి కాంగ్రెస్ తో చేతులు క‌లిపెందుకు సిద్ద‌మ‌వుతున్నారు.
పోలింగ్ దగ్గర పడుతున్న‌ కొద్దీ బీఆర్‌ఎస్ పార్టీకి వ‌రుస‌గా షాక్‌లు తగులుతున్నాయి. ఒకేరోజు ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితోనే వీళ్లద్దరు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. బీఆర్‌ఎస్ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన బాపురావును కాదని ఇప్పుడు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో బాపురావు పార్టీ మారాలని నిర్ణయించారు.
బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్లు సంకేతాలు ఇచ్చారు. రేవంత్‌తో మాట్లాడిన అనంతరం ఆయనకు బోధన్ టికెట్ కన్ఫామ్ అయినట్ట ప్రచారం నడుస్తోంది. అయ‌న‌తో పాటు ప‌లువురు ద్వితీయ శ్రేణి నేతలు కూడ పార్టీ మారుతున్నట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది..
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయన ముధోల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి 8 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దొరకలేదు. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్‌, బోధ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో వీళ్లలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే కాదు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీని వీడుతున్నారు. స్థానికంగా నల్గొండ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ అబ్బగోని రమేష్‌తోపాటు మరికొందరు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగపల్లి కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ తన భార్యతోకలిసి కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు కార్పొరేటర్లు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్, హా ఫీజ్​పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు రాజీనామా చేశారు. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్​కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే టికెట్​ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. వారికి కాంగ్రెస్ టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ మారేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *