
ఉక్రెయిన్ న్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్‌స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి.*
*300 రోజుల్లో… రష్యా-ఉక్రెయిన్ యుద్ధం : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమై 300 రోజులు గడిచాయి. పైకి రెండు దేశాల మధ్య యుద్ధంలా కనిపిస్తున్నా ప్రపంచమంతటిపై దీని ప్రభావం పడుతోంది. కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా! మొత్తానికి ఈ యుద్ధంతో ప్రభావితంకాని దేశమైతే లేదు. యుద్ధం ఆరంభమయ్యాక తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా దేశం విడిచి బయట అడుగుపెట్టారు. అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. జెలెన్‌స్కీ పర్యటన యుద్ధాన్ని చర్చల దిశగా నడిపిస్తుందో మరింత తీవ్రం చేస్తుందో చూడాలి. ఇప్పటిదాకా 300 రోజుల్లో ఎంతనష్టం జరిగిందో చూస్తే యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఆస్తినష్టం ఎంతన్నది అంచనా వేయలేకపోయినా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపితే ఉక్రెయిన్ పునర్‌నిర్మాణానికి సుమారు 349 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ యూనియన్ అంచనా.*