TT Ads

తుమ్మ‌ల‌… వాట్ నెక్ట్స్…?

తెలంగాణ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు.. ఆసక్తిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చిచెప్పిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెక్ట్స్‌ ఏం చేయబోతున్నారు. ఏ పార్టీ నుంచి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది. అయితే, తుమ్మల పార్టీ మారాలని.. కాంగ్రెస్‌లోనే చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల ఈసారి ఎలాగైనా పాలేరు నుంచి పోటీ చేయాలని వారు పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతోతుమ్మలనిర్ణయంఏంటన్నదిఉత్కంఠగా మారింది.

మాజీ మంత్రి తుమ్మ‌ల స‌భ‌కు స్వచ్ఛందంగా వేలాది మంది కదలి వ‌చ్చారు. దీంతో బీఆర్ఎస్‌లో వణుకు ప్రారంభమైంది. పోటీలో ఉంటానని తుమ్మల స్పష్టం చేయడంతో రాజకీయ పరిణామాలపై కేసీఅర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. తుమ్మల రాజకీయ నిర్ణయం దాని ప్రభావంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో మంత‌నాలు ప్రారంభించారు గులాబీ బాస్..

సీఎం కేసీఆర్‌ పాలేరు టికెట్‌ను తుమ్మలకు కాకుండా… కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు తుమ్మల. దీంతో ఆయన‌ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టింది. అయితే తుమ్మ‌ల మెత్త‌బ‌డ్డ సూచ‌న‌లు క‌నిపించ‌డంలేదు. . కేసీఆర్‌ ఆదేశాలతో ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తుమ్మల ఇంటికి వెళ్లి… ఆయనకు సర్ది చెప్పాలని చూశారు. అయినా తుమ్మల అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు తుమ్మలకు టికెట్‌ రాకపోవడంతో… ఆయన వర్గీయులు కూడా ఆవేదన చెందుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వ‌ర‌కు తుమ్మల నాగేశ్వరరావు కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న నివాసం వ‌ద్ద అభిమానుల‌తో ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజల సంకల్పం నెరవేర్చేందుకు, తాను ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలను తెచ్చి ప్రజల పాదాలను కడిగేందుకు కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు. శ్వాసయినా వదిలేస్తా కానీ.. తలదించేది లేదు. నా రాజకీయం జీవితం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అంకింతం చేస్తాన‌న్నారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించామని అనుకుంటున్న వారిది తాత్కాలిక ఆనందమేనని, ప్రజల అభిమానం, అండదండలు ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక‌ తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని రేణుకాచౌదరి చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా తుమ్మలను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.

కేవలం రెండురోజుల వ్యవధిలోనే తుమ్మల వర్గీయులు తలపెట్టిన మహార్యాలీకి ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిమంది అభిమానులు తరలిరావడం, తుమ్మలకు అఖండ స్వాగతం దక్కడంతో తుమ్మల వర్గంలో ఆనందం కనిపించింది. తమ నేత బలం, బలగం చెరిగిపోనిదని, ఆయన నిజమైన ప్రజానాయకుడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదంతా గమనించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం మౌనంగానే ఉన్నాయి.

మాజీమంత్రి తుమ్మల రాజకీయ అడుగులు కాంగ్రెస్‌ వైపేనా? అన్న చర్చ జరుగుతోంది. ర్యాలీలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫొటోలు, బీఆర్‌ఎస్‌ జెండాలు ఎక్కడా కనిపించలేదు. కేవలం తుమ్మల ఫొటో ఉన్న తెల్ల జెండాలే కనిపించాయి. కొందరు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ జెండాలతో ర్యాలీకి వచ్చి తుమ్మలకు సంఘీభావం తెలపడం, ఇతర ఏ పార్టీలకు చెందిన జెండాలు, నాయకులు కనిపించకపోవడంతో తుమ్మల కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

అయితే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వారం, పది రోజుల్లో రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *