TT Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ తలో దిక్కు జారిపోతున్నాయి. పొత్తులు కుద‌ర‌క కొన్ని పార్టీలు, ఒంట‌రిగా పోటీ చేయ‌లేక మ‌రికొన్ని పార్టీలు రంగంలోకి దిగ‌క‌ ముందే తెల్ల జండా ఎత్తేశాయి. పాద‌యాత్రలు, తీర్థ‌యాత్ర‌ల‌తో హంగామా చేసిన పార్టీలు అస‌లు టైంకు ప‌త్తాలేకుండ పోయాయి. కానీ బహుజన సమాజ్ పార్టీ మాత్రం ఎవ‌రికి బెద‌ర‌కుండా ర‌ణ‌రంగంలో పోటీకి సై అంటుంది. బ‌హుజ‌నులే ఏనుగంతా బలంతో ఒంటరిగా ముందుకు క‌దులుతోంది. బీఎస్పీ ప్రవీణ్ కుమార్ మాత్ర‌మే అలుపెరుగ కుండా ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న బ‌ల‌గంతో బ‌హుజ‌నుల బ‌లం చూపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

తెలంగాణలో బిఎస్‌పీ పార్టీ గతంలో పెద్దగా ప్ర‌భావం చూపేది కాదు. ఏ పార్టీలో టిక్కెట్లు దొరకని నేతలు బీఎస్పీ పార్టీలో బీఫాం తెచ్చుకుని పోటీ చేసి తమ సత్తా చాటేవారు. 2014లో బీఎస్పీకి ఆదిలాబాద్ జిల్లాలో రెండు సీట్లు వచ్చాయి. అందులో ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కోనేరు కోనప్ప బీఎస్పీ సీట్లపైనే విజ‌యం సాధించారు. కానీ వారు కేవలం బీఫాం కోసమే ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత వారు బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీకి స్థిరమైన నాయకత్వం లేదు. జాతీయ అధ్యక్షురాలు మాయవతి కూడా ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఐపీఎస్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్ప‌టీకే మూడు జాబితాలు జారీ చేశారు. అందరి దృష్టిని ఆకర్షించేలా ఓ ట్రాన్స్ జెండర్‌కూ టిక్కెట్ కేటాయించారు. మరో వైపు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వయంగా జనరల్ సీటులో పోటీకి దిగారు. సిర్పూర్ నుంచి తాడోపేడో తేల్చుకుంటానంటున్నారు.

తెలంగాణలో జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 63,60,158 మంది దళితులున్నారు. రాష్ట్ర జనాభాలో 17.5 శాతం ఉన్న వీరికి రాజకీయ పార్టీల త‌ల రాత‌ను మార్చే శ‌క్తి ఉంది. ఆ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. దళిత వాదం వైపు మ‌ళ్లుతున్నారు. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంటుంది. దీంతో ఒక్క సరైన నాయకుడు పుట్టుకు రాలేదు. ఇప్పుడు తాను ఆ వ‌ర్గం త‌ర‌పున బాధ్యత తీసుకుంటానని.. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగారు. ప్రవీణ్ కుమార్ సాదాసీదా ఐపీఎస్ కాదు. పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకున్నారు. గురుకుల పాఠశాలల్లో త‌న‌దైన ప‌ద్ద‌తిలో గుర్తింపు తీసుకు వ‌చ్చారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకుల హాస్టళ్లలో స్వేరోస్ విస్తృతంగా విస్తరించారు. ” స్వేరోస్‌” అనే సంస్థను తెలంగాణ‌లో పాతుకు పోయేలా చేయగలిగారు. అందు కోసం ఆయన చాలా కాలం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మెల్లగా స్వేరో భావాజాలను దళిత కాలనీలో చాప కింద నీరులా విస్తరించింది.

రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూల్‌లో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 90 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను త‌న వైపు తిప్పుకోవాల‌ని చూస్తూన్నారు. అభ్యర్థుల విజయంలో ఈ ఓటర్లే కీలకపాత్ర పోషిస్తారు. గ‌త కొంతకాలంగా అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రవీణ్ కుమార్.. ​దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నారు. బహుజనులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్​ భూములను అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. దీంతో పాటు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపైనా ఆయ‌న ప్రశ్నిస్తున్నారు. ఇవ‌న్ని ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే ఆంశాలు. ఇంటర్మీడియెట్ ​స్టూడెంట్లకు ఉచిత భోజనం లాంటి సేవా కార్యక్రమా లతో స్థానిక ఎమ్మెల్యే కోనప్ప యువతకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడా యూత్ తమవైపు మళ్లుతున్నారని ప్రవీణ్ అనుచరులు నమ్ముతున్నారు.

ప్రవీణ్ కుమార్, జేపీ, వీవీ లక్ష్మినారాయణ వంటి వారిలా కాకుండా ఓ పార్టీ రాష్ట్ర శాఖకు నాయకత్వం వహిస్తూ.. నిరంతరం పోరాడుతున్నారు. ఆ పోరాట పటిమ ద్వారా ఓ బలమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. దళిత వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగే అవకాశం మాత్రం ఉంది. దీంతో తెలంగాణ రాజ‌కీయాలో భారీ మార్పు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *