TT Ads
  • రెబ‌ల్స్ తో త‌ల‌నోప్పి

తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సీట్లు తెచ్చుకున్నారు.
నామినేషన్లు వేశారు. అయితే టిక్కెట్‌ దక్కని నేతలు, పార్టీలో కొన్నాళ్లుగా ప్రాధాన్యం, పదవులు లభించని వారు అభ్యర్థులకు సహకరించడం లేదు. తమకు టికెట్‌ ఇవ్వలేదు’ అంటూ పార్టీ అభ్యర్థులకు పోటీగా కొందరు రెబెల్స్ గా రంగంలోకి దిగారు. దీంతో రెబ‌ల్స్ తో పోటీలో ఉన్న‌వారికి త‌ల‌నోప్పి గా మారింది. కొంతమంది వెన్నుపోటు పొడవడానికి రెడీ అవుతుంటే మరికొందరు ఇంటిపట్టునే ఉంటున్నారు. రెబెల్స్‌గా పోటీలో ఉంటే అధికారిక అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడం కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు జుట్టు పీకుంటున్నారు. వారిని రంగం నుంచి తప్పించేందుకు బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి.

119 నియోజక వర్గాలకుగాను 20కి పైగా స్థానాల్లో రెబెల్‌ అభ్యర్థులున్నారు. కొన్నిచోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్‌ వేశారు. చాలా కాలంగా నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకుంటూ కచ్చితంగా టికెట్‌ వస్తుందనుకొంటే ఆఖరి క్షణంలో వేరేవాళ్లకు ఇవ్వడంతో బాగా నష్టపోయామని కొందరు… కొత్తవాళ్లు వచ్చి పాగా వేస్తే మళ్లీ అవకాశం రాదని మరికొందరు, ఈ ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా భవిష్యత్తులో ఏదైనా ఇస్తారేమో అని మరికొందరు.. ఇలా పలు కారణాలతో రెబెల్స్‌ నామినేషన్లు వేశారు. తమకే గెలుపు అవకాశాలున్నాయని, సత్తా ఏంటో చూపించాలని నామినేషన్లు వేసిన వారు కూడా ఉన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ బెడద ఉంది. ముందుగా సిట్టింగులను ప్రకటించిన బిఆర్ఎస్ కు కూడా కొన్ని చోట్ల త‌ల‌నొప్పి తప్పలేదు. ఎక్కువ చోట్ల రాష్ట్ర నాయకులు, కొన్ని చోట్ల జాతీయ నాయకులు కూడా జోక్యం చేసుకొని రెబ‌ల్స్ ను బుజ్జ‌గిస్తున్నారు. రెండు నెలల క్రితమే అధికార బీఆర్ఎస్‌అభ్యర్థులను ప్రకటించినా కిందిస్థాయి నేతలు అసంతృప్తిగా ఉండటంతో…అభ్యర్థులు ఈ నేతలపై దృష్టి సారించారు. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఊరేగింపులతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టికెట్లు రాని ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావడంతో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సాయం తీసుకోవాలని పార్టీల అధిష్ఠానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చజెప్పి అభ్యర్థులతో కలిసి పనిచేయించేలా ఒప్పిస్తున్నాయి. సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా హితబోధతో శాంతింప జేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన పార్టీనే అధికారంలోకి వస్తుందని, మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అగ్రనేతలు భరోసా ఇస్తున్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని, వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులను పొందొచ్చని అసంతృప్తులకు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశమిస్తామని అసంతృప్తులకు పదవులతో గాలం వేస్తున్నాయి.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ నియోజకవర్గం వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు చెందిన 45 మంది సభ్యులు గజ్వేల్‌లో నామినేషన్లు వేశారు. 460 ఎకరాల విస్తీర్ణం గల భూముల యాజమాన్య హక్కుల విషయంలో ధరణి పోర్టల్‌ కారణంగా తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు నాయకులు గజ్వేల్‌లో నామినేషన్లు వేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్‌ భూనిర్వాసితులు సైతం ఇక్కడ రెండు నామినేషన్లు వేశారు. మ‌రోవైపు 2017లో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడించాలంటూ భార్గవి అనే అభ్యర్థి కామారెడ్డిలో నామినేషన్ వేశారు.

నాగ్‌పుర్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధితులు 8 మంది హనుమకొండ జిల్లా పరకాలలో నామినేషన్లు వేశారు. కొత్త హైవేకు బదులు ఉన్న రహదారినే విస్తరించి తమ భూముల్ని కాపాడాలని కోరుతున్నారు.
ఎంఎస్సీ చేసి కొన్నాళ్లు లండన్‌లో ఉద్యోగం చేసి వచ్చిన ఏరు సుకేశ్‌కుమార్‌ నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో నామినేషన్‌ వేశారు. గల్ప్ లో చనిపోయిన తెలంగాణ కార్మికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం, యువతకు జాబ్‌ క్యాలెండర్‌, రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ వంటి డిమాండ్లు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బర్రెలక్కగా గుర్తింపు పొందిన శిరీష.. కొల్లాపూర్‌ నుంచి నామినేషన్‌ వేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగాల భర్తీ డిమాండ్‌తో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా స్థానికుడైన ఇమంది ఉదయ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రజల చేత చందాగా తీసుకున్న ఐదు వేల నాణేలతో నాగర్ కర్నూల్ బీఎస్పీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్‌లో పాలకుర్తి నుంచి రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి, సుధాకర్‌గౌడ్‌ బరిలో ఉన్నారు. వరంగల్‌ పశ్చిమ నుంచి జంగా టికెట్‌ ఆశించగా రాలేదు. పాలకుర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆయన ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ రెబెల్ గా సంజీవరెడ్డి ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు సహా పలువురు నాయకులు అధికారిక అభ్యర్థిని వ్యతిరేకిస్తుండగా, వారంతా సంజీవరెడ్డితో నామినేషన్‌ వేయించారు. బోథ్‌లో వన్నెల అశోక్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో బి-ఫాం మరొకరికి ఇవ్వడంతో ఆయన రెబెల్‌గా ఉన్నారు. ఇక్కడి నుంచే టికెట్‌ ఆశించి దక్కని నరేశ్‌జాదవ్‌ కూడా పోటీలో ఉన్నారు. జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో కాసుల బాలరాజు బరిలో నిలిచారు. చివరివరకు టికెట్‌పై ఆశలు పెట్టుకొన్న బాలరాజు తనకు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

సూర్యాపేటలో టికెట్‌ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక చివరి వరకు పెండింగ్‌లో పెట్టిన అధిష్ఠానం చివరకు దామోదర్‌రెడ్డికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురై పటేల్‌ రమేశ్‌రెడ్డి ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నర్సాపూర్‌ టికెట్‌ తనదే అంటూ ప్రచారం కూడా చేసుకొన్న గాలి అనిల్‌కుమార్‌కు అవకాశం దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచారు. చొప్పదండిలో నాగశేఖర్‌, డోర్నకల్‌లో నెహ్రూనాయక్‌, భూపాల్‌నాయక్‌, పాలేరులో రామసహాయం, మాధవి, పినపాకలో భట్టా విజయ్‌గాంధీ, అశ్వారావుపేటలో సున్నం నాగమణి పోటీలో ఉన్నారు. ఇల్లెందు నుంచి ఏకంగా ఆరుగురు పోటీగా నామినేషన్లు వేశారు. గుగులోత్‌ రవినాయక్‌, చీమల వెంకటేశ్వర్లు, మంగీలాల్‌నాయక్‌, రామచందర్‌నాయక్‌, ప్రవీణ్‌నాయక్‌, నాగమణి ఉన్నారు.

బీజేపీలో తిరుగుబాటు అభ్యర్థులుగా వేములవాడ నుంచి తుల ఉమ నామినేషన్‌ దాఖలు చేశారు. చెన్నమనేని వికాస్‌రావుకు బి-ఫాం ఇవ్వడంతో ఆమె బాగా అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి చెందిన ముఖ్యనాయకుల వల్లే ఇలా జరిగిందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక లాభం లేదంటూ కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆసిఫాబాద్‌లో కొట్నాక్‌ విజయ్‌కుమార్‌, చెన్నూరులో అందుగుల శ్రీనివాస్‌, బెల్లంపల్లిలో వెంకటకృష్ణ, పెద్దపల్లిలో గొట్టిముక్కల వివేక్‌రెడ్డి, కందుల సదానందం, కొలిపాక శ్రీనివాసులు నామినేషన్‌ దాఖలు చేశారు. భారాస నుంచి పెద్దపల్లిలో నల్ల మనోహర్‌రెడ్డి, స్వామి వివేక్‌ పటేల్‌, మధిరలో బమ్మెర రామ్మూర్తి, వైరాలో లకావత్‌ హరిబాబు, ములుగులో పోరిక పోమానాయక్‌ ఉన్నారు.

గులాబీ పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందు నుంచీ జరిగినా కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఆశించారు. అలాంటి వారి కోరిక నెరవేరలేదు. దీంతో పలుచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్యనేతలు కావడంతో అధిష్ఠానం వారిని దూరం చేసుకోవద్దనే నిర్ణయానికి వచ్చింది. అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవులను బుజ్జగింపులతో దారిలోకి తెచ్చుకుంటోంది. షెడ్యూల్‌ రాక ముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది. కాంగ్రెస్‌లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరింది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. టికెట్‌ దక్కని నేతలు కొందరు పార్టీని వీడారు. తీవ్ర అసమ్మతి వ్యక్తమవడంతో అధిష్ఠానం వారితో మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దాదాపు వేయికిపైగా పదవులుంటాయని సర్దిచెబుతోంది. అధికారం వచ్చాక టికెట్‌ రాని నేతలకే ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తోంది. కమలం పార్టీ సైతం అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టికెట్‌ రాని వారికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పదవులిస్తామంటోంది. రెబ‌ల్ ను దారిలోకి తెచ్చుకోక‌పోతే త‌మ గెలుపోట‌ముల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని అన్నీ పార్టీల నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *