ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారాలు ముమ్మరం చేస్తోన్న ప్రధాన రాజకీయ పార్టీలు

0
4

 

తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్నది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. స‌మ‌యం లేదు… మిత్ర‌మా ప‌దండి ముందుకు అంటూ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీలు, పార్టీల అగ్రనేతలు సిద్ద‌మ‌య్యారు. ఊరు, వాడా చుట్టేసి ఓటర్లను ఆక‌ర్శించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ప్రచారంతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకొని వీక్‌గా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ అన్నీ పార్టీల‌కంటే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించి దూసుకుపోతోంది. ఇప్ప‌టికీ ప్రచారంలో కూడా అదే స్పీడ్‌ కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు ఎలాంటి చాయిస్ ఇవ్వకూడదన్న ఆలోచనతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్‌.. ఎక్కడా అలసత్వం లేకుండా అందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి రోజు ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పటికే 70కిపైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన…ప్రచార గడువు ముగిసేలోపు వంద నియోజకవర్గాలను చుట్టేయాలని ఆలోచనలో ఉన్నారు. మ‌రోవైపు కేసీఆర్ ప్రచారం హోరెత్తిస్తుంటే ఇంకోవైపు హరీష్ రావు, కేటీఆర్‌ కూడా జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. మిగతా మంత్రులు, ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమ‌య్యారు. గెలుపు కోసం గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాంగ్రెస్‌ నేతలు కూడా అధికార పార్టీకి దీటుగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చుట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి… బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్నారు. ప‌దేళ్ల‌ దొర‌ల ఆహంకారం పోవాలి.. మార్పు రావాలి… అంటూ జ‌నాల్లోకి వెళ్లుతున్నారు. తాము అధికారంలోకి వస్తే తీసుకురానున్న పథకాలతోపాటు మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేస్తూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా కాంగ్రెస్ అగ్రనేతలు కూడ రంగంలోకి దిగుతున్నారు. వారితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ లీడర్లు కూడా తెలంగాణలో ఓ లుక్‌ వేస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా డిల్లీ నేతలంతా తెలంగాణలో ప్రచారానికి దిగి వ‌చ్చారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఊరూవాడా తెగ తిరుగుతున్నారు. స్టార్ క్యాంపెయినర్స్‌గా ఉన్న వాళ్లు కూడా తమ నియోజకవర్గానికో లేదా తమ జిల్లాకో పరిమితమై ప్రచారం చేస్తున్నారు.
బీజేపీలో కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కాషాయం దళం ఈ మధ్య క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల ముగ్గురు కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తమకు కీలకమైన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. వారికి తోడుగా కేంద్ర మంత్రులు, ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఈ వారంలోనే మోదీ, అమిత్‌షా మరోసారి ప్రచారం చేయ‌నున్నారు.. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ కూడా ప్రచారం మొద‌లుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌తో ప్రచారం తమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ ఆశ‌గా ఎదురుచూస్తుంది. అయితే ఆయనతోపాటు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటారనేది మాత్రం ఇంత‌వ‌ర‌కు క్లారిటీ లేదు.
ఆఫ్‌లైన్‌ ప్రచారంలో ఇలా ఉంటే ఆన్‌లైన్ ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ఒకరికి మించి మరొకరు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. పార్టీలతోపాటు నాయకులంతా ఎవరికి వారుగా టీంలను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, సామాన్య‌ ప్రజల పేరుతో ప్రత్యేక ముఖాముఖీలు అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల ప్ర‌చారం తారాస్థాయికి చేర‌డంతో తెలంగాణ ప‌ల్లెల్లో ఎన్నిక‌ల కోలాహాలం నెల‌కొంది. ఢిల్లీ స్థాయి నేత‌ల నుంచి గ‌ల్లీ లీడ‌ర్ల తో ఊరు, వాడలో పండుగ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here