ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్న బి.ఆర్.ఎస్..!!

0
1

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్

— నిప్పు రాజేస్తున్న బీఆర్ఎస్

— తెలంగాణపై ఆంధ్ర పెత్తనం అంటూ నేతల ఆగ్రహం

— కాంగ్రెస్ కు షర్మిల బేషరతు మద్దతు

— రాష్ట్రంలో జట్టు కట్టిన బిజెపి జనసేన
— టిఆర్ఎస్ ను వణికిస్తున్న ఆంధ్ర ఓటర్లు

కే .అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ 9603322489

ఏ ఆర్ మీడియా, ఏసియన్ మీడియా హైదరాబాద్:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయం రంజుగా మారుతుంది.. ఇప్పటివరకు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పెట్టి అభివృద్ధి జపం చేస్తూ ఓట్లు అడుగుతోంది… తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, తన రాజకీయ పంథాను మార్చి సెంటిమెంట్ వైపు అడుగులు వేస్తుంది.. తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ పదాన్ని మార్చి వేసి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసింది.. తమ పార్టీ జెండాలో తెలంగాణ పటం లేకుండా చేసింది. ఇక రాష్ట్రం వచ్చేసింది కదా అంటూ పార్టీని కూడా భారతదేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని తలంపుతో బి ఆర్ ఎస్ గా అవతరించింది.. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మళ్లుతున్నారని, మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిలింపజేసి మరో మారు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు విస్తృతం చేసింది.. ఇప్పటికే , రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా బీఆర్ఎస్ నేతలు తమ ప్రచార పర్వంలో తెలంగాణ సెంటిమెంటును మరో మారు తెరపైకి తెస్తున్నారు…’ ఆంధ్ర వాళ్ళంతా” మళ్లీ తెలంగాణ పై పెత్తనం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, దీనిని తిప్పి కొట్టాలని ఆ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు.. తాజాగా మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, కెటి రామారావు, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలంగాణ సెంటిమెంట్ డైలాగులను వదులుతూ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారు.. అధికారం కైవసం చేసుకోవడం కోసం తెలంగాణలో సెటిలైన ఆంధ్ర ఓటర్లు తమకు ఎక్కడ వ్యతిరేకంగా ఓటు వేస్తారో అని భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి..

కాంగ్రెస్ కు షర్మిల మద్దతు:

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటుంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సందర్భంగా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వైసిపి అసెంబ్లీ ఎన్నికల రంగం నుంచి తప్పుకుంది ..అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు .. అలాగే, టిడిపి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది … దాదాపు ఆ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం వల్ల వారంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ కి భయం పట్టుకుంది.. దీంతో మరోమారు తెలంగాణ సెంటిమెంటును లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా వాళ్లతో చేతులు కలుపుతుందని ఆరోపిస్తున్నారు.. ఏదైనా పొరపాటు జరిగితే, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో భయపెట్టే విధంగా చేస్తున్నారు. ..

అలాగే బిజెపి కూడా జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ కు వేసే ఓట్లను సైతం జనసేన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… దీనిపై అధికార పార్టీ నేతలు తమ ప్రచార పర్వంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు… అంటే , మరో మారు తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలని ముందస్తుగా పిలుపునిస్తున్నట్లు అర్థమవుతుంది…

ఆంధ్రా వాళ్లపై కేటీఆర్ ఫైర్:

ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో సెటిల్ అయిన వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.. మంత్రి కేటీఆర్ వాటిని వ్యతిరేకిస్తూ చులకనగా మాట్లాడారు.. ఆంధ్రావాళ్లు ఏదైనా చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్లి చేసుకోవాలని
హుంకరించారు.. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సెటిలైన ఆంధ్ర ప్రజలు ఈసారి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారు.. దీనిని గమనించిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు అరెస్టు పై కొంత సానుకూలంగా మాట్లాడారు.. అలాగే, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.. ఎందుకంటే, అక్కడ ఉన్న ఖమ్మ సామాజిక ఓట్లను కొల్లగొట్టడం కోసం, మంత్రి కేటీఆర్ సైతం, ఖమ్మం జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టిడిపికి అనుకూలంగా మాట్లాడారు.. ఇలా అన్ని రకాలుగా తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ, వారు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.. పైగా, టిడిపి, వైఎస్ఆర్ షర్మిల పార్టీ 100 శాతం కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ ఉండడంతో, మరోమారు బీఆర్ఎస్ పార్టీ నేతలు “తెలంగాణ సెంటిమెంట్” ను తెరపైకి తెస్తున్నారు.. .కాంగ్రెస్ పార్టీతో ఆంధ్ర పార్టీలు “మిలాకత్” అయ్యాయని ఆరోపిస్తున్నారు… ఏదేమైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ఎత్తుకోక తప్పడం లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here