మోదీ ప్రభుత్వం సహకరించకున్నా… ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న ఆగని అభివృద్ధి

‌- అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత, రాజనీతజ్ఞతే కారణం

‌- అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రేరణ

‌- అన్నపూర్ణగా మారిన తెలంగాణ తల్లి… దాని వెనుక కేసీఆర్ తీవ్ర శ్రమ

‌- అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి

‌- శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించపోయినా … ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్న తెలంగాణలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నా .. పట్టుదలతో రాష్ట్రాన్ని పురోగతి బాటలో మహోన్నత నాయకుడు కేసీఆర్ నడిపిస్తున్నారని చెప్పారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ఆమె మాట్లాడారు.

దేశంలో మన రాష్ట్రం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి తన ప్రసంగంలో కూలంకుశంగా చాలా అద్భుతంగా చెప్పారని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే మానవతా దృక్పథం, దార్శనికత, రాజనీతజ్ఞత, కార్యదీక్ష కలిగిన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. అంటువంటి నాయకుడు సీఎం కేసీఆర్ కు ఎన్ని ఎదురుగాలులు వీచినా… కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా… రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అడుగడుగున అడ్డుపడినా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం ప్రజలందరికీ గర్వకారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ కార్యక్రమం, పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని, ఉత్తేజాన్నిస్తున్న విధంగా ఉన్నాయని, దాదాపు 17-18 రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి అనేక కార్యక్రమాలను అధ్యయనం చేశాయని గుర్తు చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ సభకు హాజరైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్ మన దగ్గర అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంతో స్పూర్తి పొంది వెంటనే వారి రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించడం మన రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధించిందని తెలియాలంటే ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత పెరిగిందన్నది కొలమానం ఉంటుందని, 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 124104 ఉండేదని, 2022 నాటికి అది రూ. 317118కు పెరిగిందని వివరించారు. పెద్ద ఎత్తున జీవన విధానం, జీవన శైలిలో మార్పులు వచ్చాయో అర్థమవుతోందని తెలిపారు. దానికి కేసీఆర్ పాలన ఎంతగానో తోడ్పడిందని స్పష్టమవుతోందని అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెన్షన్లు, పెట్టుబడులు పరిశ్రమల వంటి రంగాలతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అడవుల పెంపకం, ఆలయాల అభివృద్ధి దళిత వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి, అగ్రవర్ణాల పేదల సంక్షేమం… ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా మన ప్రభుత్వం ఏ ఒక్కరినీ విస్మరించలేదని, ప్రతీ ఒక్కరి సమస్యను తన సమస్యలుగా భావించి ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందువల్లనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని తేల్చిచెప్పారు.

దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే గర్భిణీ స్త్రీలు, మహిళా సంక్షేమం కోసం అనేక మాటలు చెప్పే ప్రభుత్వాల మాటలు వింటాం కానీ నిధులు ఖర్చు చేసి తోడ్పాటునివ్వడాన్న తక్కువగా చూస్తామని చెప్పారు. లక్ష ప్రసవాలకు 92 మంది మరణించేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అవి 43కు తగ్గాయని పేర్కొన్నారు. శిశువుల మరణాలు కూడా తగ్గాయని అన్నారు. పోషకాహారాన్ని అందించే అంగన్ వాడీ, ఆశా వర్కర్ల వ్యవస్థను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 35700 గన్ వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే వర్కర్ల వేతనం చాలా తక్కువగా ఉండేదని, దాన్ని సీఎం కేసీఆర్ రూ. 13650కు పెంచారని తెలిపారు. అందులో కేంద్రం వాటా కేవలం రూ. 2700 మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 10950 ఉందని వెల్లడించారు. ఆశా వర్కర్ల వేతనం రూ. 2 వేలుగా ఉండేదని, దాన్ని రూ. 9750 పెంచామని గర్తు చేశారు. ఇందులోనూ కేంద్రం వాటా కేవలం రూ. 1200 మాత్రమేనని ఎండగట్టారు. కేవలం మనస్సు ఉంటే సరిపోదదని, ఆ మనస్సుకు, ఆలోచనలకు తగ్గట్టుగా అవసరమైన చోట ప్రజలు డబ్బు ఇస్తుండాలని, అలా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది గర్భణీలకు లబ్దీ జరిగిందని చెప్పారు. పిల్లల విద్య కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసిందని, మన ఊరు మన బడి కింద రూ. 7 వేల కోట్లతోపాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని, మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాన్ని రూ. 3 వేలకు ప్రభుత్వం పెంచిందని, అందులో కేవలం రూ. 600 మాత్రమే కేంద్రం వాటా అని వివరించారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇదంతా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు.

ప్రైవేటు పెట్టబడులను ఆకర్శించి రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకుపైగా ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలను ఇచ్చామని గుర్తు చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి వేతనాలు పెంచామని, ఆర్టీసీ, సింగరేణి, జన్కో, టాన్స్ కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తమ గ్రామాలను కూడా తెలంగాణలో విలీనం చేయాలంటూ పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి సర్పంచ్ లు డిమాండ్ చేస్తుండడం తెలంగాణకు గర్వకారణమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మారిందని, దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ తీవ్రంగా ఉందని తెలిపారు.

“నాకు దేశం ఏం ఇచ్చిందన్న నిర్లప్తత గతంలో కొంత మందిలో ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి వచ్చాక నాకు దేశం ఏం ఇచ్చిందన్నది కాకుండా దేశానికి నేనేం ఇస్తున్న అనే పంథాతో ఆలోచిస్తు రాష్ట్రంలో సంపద ను పెంచి దాన్ని దేశమంతటా పంచుకున్న సందర్భం ఇది. ” అని వ్యాఖ్యానించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిల్ లోనూ ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ కు కవిత విజ్ఞప్తి చేశారు. దానికి తక్షణమే స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకు అంగీకరించారు. ఇప్పటికే ఈ విషయమైన సంబంధిత అధికారులకు దేశాలు జారీ చేశామని తెలియజేశారు.