తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ అర్చకుడు ఎం.సీతారామన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

 

నిన్న ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ మొబైల్ ఫోన్లను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఆర్.మహాదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాద్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ఇలాంటి నిషేధం ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది.

ఆలయానికి వచ్చిన భక్తులు తమ సెల్‌ఫోన్లలో దేవతామూర్తుల ఫొటోలు తీస్తున్నారని, వీడియోలు చిత్రీకరిస్తున్నారని, పూజలను కూడా రికార్డు చేస్తున్నారని సీతారామన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది పురాతన ఆలయమని, ఇక్కడ ఆగమ నియమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆలయంలో సెల్‌ఫోన్లు ఉపయోగించడం వల్ల ఆలయ భద్రతకు, విలువైన వస్తువులకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా మహిళా భక్తులను రహస్యంగా తమ ఫోన్లలో చిత్రీకరించే అవకాశం ఉందని అన్నారు

. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆలయ పవిత్రతను కాపాడేలా అన్ని ఆలయాల్లోనూ సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధం విధించాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది..