*ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి: సుప్రీం కోర్టు..!*

ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది.ఇది రాతరూపంలో లేని నిబంధన అని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలో అంతర్నిహితంగా ఉన్న కట్టుబాటు అని తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
మంత్రులు, ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలపై ఆంక్షలు విధించగలమా? అనే ప్రశ్నతో దాఖలైన పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు వివాదాస్పద, కించపరిచే వ్యాఖ్యలు చేసినపుడు, వారిపై ఆంక్షలు విధించడానికి తగిన అదనపు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేయవచ్చునా? అనే అంశంపై తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ విచారణ జరిపింది.
కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవడాన్ని మన రాజకీయ సమాజానికి, పౌర సమాజానికి నేర్పించాలని పేర్కొంది. ప్రజా ప్రతినిధుల విషయంలో, మన రాజ్యాంగంలోని అధికరణ 19(2) ఏం చెప్తున్నప్పటికీ, బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించేవారు విధించుకునే అంతర్నిహిత ఆంక్షలు లేదా పరిమితులు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన సంస్కృతి మన దేశంలో లేదా? అని ప్రశ్నించింది.