తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియలో స్పీడ్ పెరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ కోసం భారీ సంఖ్య‌లో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల జాబితాపై క‌మిటీ కసరత్తు సుదీర్ఘంగా సాగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను చెక్ చేసి అర్హులైన‌ అభ్యర్థులను బరిలోకి దింపేందు కోసం ఎంపిక పూర్తి చేసి పైన‌ల్ లిస్ట్ సీల్డ్‌ కవర్‌లో ఉంచింది. ఇక‌ స్క్రీనింగ్‌ కమిటీ లో దీనిపై చర్చించనుంది. కాంగ్రెస్ జాబితా సిద్ధమైనా షెడ్యూల్ వచ్చే వరకూ ఆగడం మంచిదని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అంత తేలికగా ముగిసిపోయే ప్రక్రియ కాదు.. అభ్యర్థులపై ఓ అవగాహనకు వచ్చినా.. షెడ్యూల్ వచ్చే వరకూ సాగుతూ … అభ్యర్థుల స‌హ‌నానికి అస‌లు ప‌రీక్ష పెట్ట‌నుంది.

అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది. ఎక్కువ స్థానాల్లో ఐదు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఎంపిక చేసిన ఆ లిస్ట్ ను స్క్రీనింగ్‌ కమిటీకి అంద‌చేశారు. అభ్యర్థుల ఎంపికలో నియోజకవర్గాల వారిగా సీనియారిటీ, ఇత‌ర ఆంశాల‌వారిగా లిస్ట్ రెడీ చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థులకు గ‌ట్టి పోటీ ఇచ్చే వారికి ప‌స్ట్ ప్రియార్టీగా లిస్ట్ ను రెడీ చేశారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ కోసం కమిటీలోని సభ్యులు కూడ దరఖాస్తు చేసుకున్నారు. లిస్ట్ లో తమకే తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని కొందరు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆందు కోసం కమిటీలోని మిగతా సభ్యుల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లిస్ట్ లో రెడ్డి సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం లభించింది. దీంతో కాంగ్రెస్ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్ఎస్ వెనుకబడిన తరగతులకు ఇచ్చిన సీట్ల కన్నా తమ పార్టీలో ఎక్కువ సీట్లను ఈ వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇందు కోసం గ‌ట్టీ పోటినిచ్చే బీసీ అభ్యర్థుల కోసం ప్ర‌త్యేకంగా లిస్ట్ త‌యారు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన లిస్ట్ పై మ‌రోసారి క్లియ‌ర్ గా స్ట‌డీ చేసి పైన‌ల్ లిస్ట్ ను ఢిల్లీలోని కేంద్ర ఎలక్షన్‌ కమిటీకి ఇవ్వ‌నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసి పార్టీ ముఖ్యులకు ఈ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత తొలి జాబితా ప్రకటన వెల‌బ‌డ‌నుంది.

వీలైనంత త్వరగా అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు కానీ.. వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత కేసీఆర్ కొంత మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అలాంటి చాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అదే సమయంలో అభ్యర్థులపై ఒత్తిళ్లు రాకుండా చూసుకోవడానికైనా.. లిస్ట్ ను ఆలస్యంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాతనే జాబితా ప్రకటించడం మంచిదన్న అభిప్రాయం టీ కాంగ్రెస్ లో ఎక్కువగా వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి చర్చించింది. ఏయే విషయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇవ్వాలనే విషయాలపై చర్చించేందుకు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అయితే అభ్యర్థుల ఎంపిక ప్ర‌క్రియ చాల పెద్ద విషయమని, స్క్రీనింగ్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు కూడ ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇందు కోసం మరోసారి ప్ర‌త్యేకంగా సమావేశం అవుతామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో త‌మ పార్టీ గెలుపు పై ప‌క్క ప్లాన్ తో ముందుకు క‌దులుతోంది కాంగ్రెస్ పార్టీ.. పార్టీ నేతలు మొత్తం హైదరాబాద్ కు తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ కార్యవర్గం కొత్తగా ఏర్పాడిన త‌రువాత జరుగుతున్న ప‌స్ట్ మీటింగ్ ఇదే. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు.

అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రానుంది. సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది.