బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి, ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ, ఆ సినిమా తర్వాత ఆయన ఫ్లాపుల్లో ఉన్నారు. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ పరిచాయి. దాంతో, ఎలాగైనా మంచి హిట్తో పుంజుకోవాలని ప్రభాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సలార్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్. ఓ మూతబడ్డ థియేటర్ చుట్టూ సాగే హారర్ కామెడీ చిత్రం ఇది.

ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ లీక్ అయింది. షూటింగ్ లొకేషన్ లో తీసిన ఫొటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ ఒత్తయిన గడ్డం, కొంచెం పొడవైన హెయిర్ స్టయిల్ తో సూపర్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రాధేశ్యామ్ లో ప్రభాస్ లుక్ పై విమర్శలు వచ్చాయి. గడ్డం, మీసాలు లేకుండా రెబల్ స్టార్ అస్సలు బాగాలేడని అభిమానులు పెదవి విరిచారు. ఇప్పుడు సలార్ తో పాటు రాజా డీలక్స్ లో ప్రభాస్ లుక్ బాగుందని అంటున్నారు. రాజా డీలక్స్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.