తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు.

అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు వెల్లడించారు.

భారతీయ జనతా పార్టీ కి తెలంగాణ లో క్యాడర్ ,లీడర్లు లేరని తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శించింది. ఆ పార్టీకి నిర్మాణాత్మకమైన సిద్ధాంతం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ..రామ్ నామ్ జపం చేసుకుంటూ పరాయి పార్టీలకు చెందిన నాయకులను ప్రలోభ పెట్టడం లేక సిబిఐ ఈడి ఐటి వంటి సంస్థల ఉపయోగించి భయపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆమె విమర్శించారు.

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉండే భారతీయ జనతా పార్టీ లీడర్లు ప్రయత్నం చేస్తున్నారని కానీ వారి ప్రయత్నాలు సాగబోవని ఆమె అన్నారు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటికి రావడంతో బిజెపి అసలు స్వరూపం బయటపడిందని ఆమె అన్నారు

. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో కవిత మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ నాయకుడు సంతోష్ జికి పోలీసులు నోటీస్ ఇస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదని కవిత అన్నారు. నేరంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని దానికి బండి సంజయ్ షేక్ అవుతున్నాడు అంటే ఈ కేసులో ఉన్న తీవ్రతను అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు

. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్రంలో మంత్రులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని కవిత ధ్వజం ఎత్తారు. ఇలాంటి దాడులకు తాము భయపడబోమని మరింత రాటు తేలి పార్టీని బలోపేతం చేస్తామని కవిత బిజెపి నాయకులను హెచ్చరించారు.