సరిహద్దుల్లో సుస్థిరత కోసం భారత్ తో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద చైనా బలగాలు భారత్ వాస్తవాధీన రేఖ లోపలకు చొచ్చుకు వచ్చి ఘర్షణకు దిగడం తెలిసిందే. చైనా బలగాలను భారత సైన్యం తరిమి కొట్టింది. దీంతో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తాజాగా ప్రకటన విడుదల చేసింది. చైనా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరమైన, బలమైన వృద్ధికి భారత్ తో కలసి పనిచేసేందుకు సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించారు.

రెండు దేశాలు దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు చేసుకుంటున్నాయని, సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య ఈ నెల 20న 17వ కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో స్థిరత్వాన్ని, భద్రతను కొనసాగించాలన్న అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి ప్రకటన విడుదల చేయడం గమనార్హం