రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తే పోలీసులైనా జైలు కెళ్లక తప్పదు ..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ

0
3

రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కును ఉల్లంఘిస్తే పోలీసులైనా, ఉన్నతాధికారులైనా జైలుకెళ్లక తప్పదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. ఆదివారం నాటి ఉదయం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిఐటియు, ఎంబివికె ఆధ్వర్యంలో నండూరి ప్రసాదరావు స్మారక సెమినార్ ను నిర్వహించారు. ‘ప్రజా ఉద్యమాలు… నిర్బంధం’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సదస్సుకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపాలగౌడ కీలక ప్రసంగం చేశారు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి నియంతృత్వంలో నలిగిపోయిన భారతీయులు అనేక పోరాటాల ఫలితంగా స్వాతంత్ర్యం పొందారని గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర్య పోరాటాల ఫలితమే మన రాజ్యాంగం అని రాజ్యాంగం అనేక హక్కులను దేశ ప్రజలకు కల్పించిందని అందులో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. తిరుపతి నగరంలోను, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పోలీసులు అనుసరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు సదస్సు ప్రారంభానికి ముందు ఆయన సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకించినట్టు తెలిపారు. తిరుపతిలోని సిఐటియు నాయకుల గృహాలను, కార్యాలయాన్ని దిగ్భంధించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మధు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ పట్ల పోలీసులు తిరుపతిలో వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అందరూ స్వాతంత్ర పోరాట ఫలాన్ని అనుభవిస్తున్నారని, ఆ కారణంగానే ఆ పదవుల్లో కొనసాగుతున్నారని ఈ విషయం గుర్తుండక పోతే అర్థం లేదని ఆయన అన్నారు. స్వాతంత్ర్య ఫలాల కారకులు కార్మికులేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల ద్వారా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, టిటిడి తదితర కార్మికుల మీద సాగిస్తున్న పైశాచిక దాడిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కార్మిక శక్తి లేకుంటే దేశాభివృద్ధి లేదని విశదీకరించారు. కార్మికులే లేకుంటే ఉత్పత్తి లేదని, ఉత్పత్తి లేకుంటే ప్రజల అవసరాలు తీర్చే వారు ఎవరని? ప్రశ్నించారు. కార్మికులే లేకపోతే వ్యవస్థలో ఏ శక్తులకు స్థానం ఉండదని ఈ పరిస్థితిని గుర్తుంచుకోక పోలీసులు, ఉన్నతాధికారులు వ్యవహరించడం అధర్మమని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం తిరుపతి నగరంలో ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అప్రజాస్వామికంగా వ్యవహరించడం సమంజసం గా లేదని, మహిళల పట్ల సాగిస్తున్న దౌర్జన్యం దారుణమని తప్పుపట్టారు. టీటీడీ అటవీ కార్మికులు రెండేళ్లుగా నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకోకపోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అపహాస్యం చేయవద్దని, రాజ్యాంగ హక్కులను కాపాడే బాధ్యత శాసన వ్యవస్థకు ఉందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సమంగా నడవటానికి నాలుగు కీలకంగాలుగా ఉన్న వ్యవస్థలు పట్టించుకోవాలని సూచించారు. పోలీసులు సాగిస్తున్న దౌర్జన్యాలు, పెడుతున్న అక్రమ కేసులపై తీవ్రంగా స్పందించాలని ప్రజాస్వామ్య శక్తులకు, లాయర్లకు సూచించారు. కార్మిక కార్యాలయాల చుట్టూ, నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసులు మోహరించడం, అడ్డుకోవడం, గృహనిర్బంధాలు గావించడం … మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆయన అన్నారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ కి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్ర హైకోర్టు పరిధిలో పోలీస్ అథారిటీ అనే వ్యవస్థ ఉంటుందని దానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తాడని పోలీస్ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. మానవ హక్కుల కమిషన్లు పట్టించుకోని పక్షంలో హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. బార్ కౌన్సిల్, లాయర్లు ఇతర న్యాయ కోవిదులు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందని, కార్మిక వర్గానికి అండగా నిలబడాలని ఆయన సూచించారు. తిరుపతిలో జరిగిన సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు హాజరు కావడం శుభపరిణామమని, ఈ పరిస్థితిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అన్ని స్థాయిలలో అందివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి తానే స్వయంగా పిటిషన్లు తయారు చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్నానని, అవసరమైతే సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లను తాను ఏర్పాటు చేస్తానని, హైకోర్టులో సైతం అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని కార్మికుల హర్షద్వానాల మధ్య ఆయన ప్రకటించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వర్గంపై సాగిస్తున్న ఉద్యమాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, ఇందులో మహిళలను కూడా విడిచిపెట్టడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రానున్న రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని కేవలం కార్మిక వర్గమే కాకుండా రైతులను, వ్యవసాయ కూలీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ పోరాటాలు తీవ్రతరం చేస్తామని ప్రకటించారు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సాగించిన ధమనకాండను ఈ సందర్భంగా సభ దృష్టికి నర్సింగ్ రావు తీసుకొచ్చారు. సమస్యలను ప్రశ్నిస్తుంటే పరిష్కారానికి చొరవ చూపాల్సిన ప్రభుత్వం నోరెత్తకుండా లాఠీలను ఝళిపించడం దారుణమని విమర్శించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here