TT Ads

..శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీ వీడింది. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధి శ్రీకూర్మం లో స్థానిక వైసిపి నేత బరాటం రామశేషు హత్య కేసును పోలీసులు చేధించారు. రాజకీయంగా ఎదుగుదలకు అడ్డు వస్తున్నారనే కారణంతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. ఘటన జరిగింది మొదలు అప్రమత్తమైన పోలీసులు పదిరోజుల్లోనే చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకూర్మం మేజర్ గ్రామ పంచాయితికి చెందిన మాజీ సర్పంచ్, ప్రస్తుత అయిదవ ప్రాదేశిక ఎంపిటిసి సభ్యుడు మండల  పరిషత్ ఉపాధ్యక్షుడు బరాటం రామశేషుకు అదే గ్రామానికి చెందిన మరో వర్గం నేత తలకోన సుధాకర్ రెడ్డి కుటుంబానికి మధ్య వైరం నడుస్తోంది. ఇద్దరు అధికార వైసిపి పార్టీ కి చెందిన నేతలే అయినప్పటికీ వీరి మధ్య గత కొన్నేళ్లుగా పొసగడం లేదు. రామశేషు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుదలను చూసి తట్టుకోలేని సుధాకర్ రెడ్డి.. కుమారుడు రవీంద్ర రెడ్డి తో కలసి రామశేషు హత్యకు పధకం రచించారు. ఇందుకోసం తొలుత స్థానికంగా సుంకరిపాలెం గ్రామానికి చెందిన సావాడ శ్రీను తో కిరాయికి మాట్లాడి నాలుగు లక్షలకు సుఫారీ కుదుర్చుకున్నారు. దీంతో సావాడ శ్రీను కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన సుబ్బారెడ్డి తో హత్యకు డీల్ కుదుర్చుకున్నాడు. గత కొన్ని నెలలుగా రామశేషు కదలికలపై రెక్కి నిర్వహించిన నిందితులు.. ఈ నెల ఆరవ తేదిన ఉదయపు వ్యాహ్యాళి లో ఉన్న బరాటం రామశేషును.. శ్రీకూర్మం గ్రామంలోని ఆయన గ్యాస్ గోడౌన్ సమీపం లోనే కిరాతకంగా హత్య చేశారు. బలమైన గాయాలతో తీవ్ర రక్తస్రావం అయిన బరాటం రామశేషు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తిని పారవేసి నిందితులు పల్సర్ బైక్ పై పారరయ్యారు. ఎటువంటి ఆధారాలు నిందితులు వదలనప్పటికీ సిసి కెమెరా ఫుటేజి ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. తొలుత శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటలు లో వారు బస చేసినట్టు.. అక్కడి నుండి పదిహేడవ తేదిన ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో నిందితులు కలసి.. పరారీకి ప్లాన్ చెయ్యడం తో పాటు.. సుఫారీ మొత్తం పై చర్చించుకుంటున్న సందర్భంలో పక్కా సమాచారం తో దాడి చేసిన పోలీసులు.. పారిపోతున్న నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదు, రెండు కత్తులు, హత్య సమయంలో ఉపయోగించిన పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మొత్తం నలుగురు వ్యక్తులను హత్య కేసులో నిందితులుగా చూపిన పోలీసులు.. ఆచూకి దొరకని మరో కీలక వ్యక్తి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *