TT Ads

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి సోనియా

తెలంగాణ పై ప్రత్యేక దృష్టి

త్వరలో తెలంగాణలో క్యాంపు

ప్రతి జిల్లాలో క్యాంపులు పెట్టనున్న సోనియా

తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు

కొండం అశోక్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఫోన్ నెంబర్: 9603322489

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విహాత్మకంగా వ్యవహరించేందుకు కార్యచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో మళ్లీ సోనియా గాంధీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణను అస్తగతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ప్రజాభిమానం పొందేందుకు పనులు ప్రారంభించింది. దశాబ్దాల తరబడి “తెలంగాణ గోసను” గమనించిన సోనియా గాంధీ పార్టీ పరంగా, ఎన్ని ఇబ్బందులు తలెత్తిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఔన్నత్యాన్ని చాటుకుంది. ఇదే విషయాన్ని, తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కలిసి విస్తృతమైన ప్రచారం చేయాలని నిర్ణయించి, ఆ పార్టీ నాయకులు అడుగులు వేస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రజాభిమానాన్ని ఈసారి పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోనుంది. ప్రధానంగా సోనియాగాంధీని రాష్ట్రంలో పర్యటించే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం . ఇప్పటికే ఏఐసీసీ తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సారించి అధికారం చేపట్టాలని లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ను చేజారకుండా మసులుకుంటుంది .ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది.
సోనియాతో విస్తృత ప్రచారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తింపు ఇప్పటివరకు రాలేదని గ్రహించిన అధిష్టానం ,ఈ దిశగా దృష్టి సారించింది

.తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరాభిమానాలు లభించే విధంగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రమంతా విస్తృత ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, ప్రతి జిల్లా కేంద్రంలో రెండు మూడు రోజులపాటు పర్యటించే విధంగా సోనియా గాంధీని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పించినట్లు సమాచారం.” తెలంగాణ తల్లిగా ” భావించే సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఆదరించే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి, వారు, క్షేత్రస్థాయిలో పర్యటించే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. ప్రధానంగా సోనియాగాంధీ సభలు, సమావేశాలు విస్తృతంగా ఏర్పాటుచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రముఖ నగరాల్లో కూడా సోనియా గాంధీ పర్యటనలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల ప్రజలకు సోనియాగాంధీ సందేశాన్ని చేరవేసే విధంగా రూట్ మ్యాప్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది.


రేవంత్ చరిస్మా ,సోనియా గాంధీ ప్రచారం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ భావిస్తోంది.

సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలం:

వచ్చే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్ లో ముందుకు సాగుతుంది. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల తో పాటు, యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది.

కెసిఆర్ మోసాలపై డిజిటల్ తెరలు:

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు, ప్రజలను ఏ విధంగా మోసం చేశారని అంశాల పైన విస్తృత ప్రచారం చేయడం కోసం మొబైల్ డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది

. ఇందులో భాగంగా ఇప్పటికే మొబైల్ డిజిటల్ వాహనాలను ఖరీదు చేసేందుకు నిధులు కూడా విడుదల చేసినట్లు సమాచారం. ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్ చేసిన, దగాకోరు మోసాల పైన వీడియో చిత్రీకరణ చేసి, ఆనాటి అంశాలను మొత్తం ప్రజలకు విడమరిచి చెప్పేందుకు ప్రత్యేక డిజిటల్ విజువలైజేషన్ టీం ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది . దాదాపు 1000 మందితో ఈ వ్యవస్థ పనులను ప్రారంభించినట్లు సమాచారం . ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, ఆనాడు అర్ధాంతరంగా దీక్ష విరమించి, నిమ్మరసం తాగిన విజువల్స్ ను హైలైట్ గా చూపించాలని నిర్ణయించారు. అనంతరం ఉస్మానియా విద్యార్థులు కేసిఆర్ కు “పాడే కట్టి ” దహనం చేసిన విజువల్స్ కూడా ప్రజల ముందుంచాలి. అలాగే , విద్యార్థుల తిరుగుబాటును గ్రహించిన కెసిఆర్ దీక్షను కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించిన తీరును, ఆడియో, వీడియోలను పూర్తిగా ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఇలా సీఎం కేసీఆర్ ,తెలంగాణకు ద్రోహం చేసిన విజువల్స్ ను ప్రజల మనసుల్లోకి ఎక్కించడం వల్ల ప్రయోజనం రాబట్టచ్చని పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతుంది.

గొంగళి పురుగు ఏడవాయే:

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రతిసారి చెప్పే గొంగళి పురుగు ఎక్కడ పోయిందని అంశంపై ప్రజలు ఆలోచించే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

“తెలంగాణ రాష్ట్రం సాధన” కోసం కలిసివచ్చే గొంగళి పురుగునైన అక్కున చేర్చుకుంటామని చెప్పిన కేసీఆర్ మాటమార్చి , అబద్ధాలు చెబుతూ, అందర్నీ మోసం చేసిన విధానంపై కూడా చైతన్యపరచాలని నిర్ణయించింది .ఇందులో భాగంగానే ఆనాటి ఉద్యమకారుడు ఇప్పటి సీఎం కేసీఆర్ తన సకుటుంబ సపరివారంతో కలిసి ఢిల్లీలో సోనియా గాంధీ ని కలిసిన విజువల్స్ , అక్కడ ,ఆనాడు, సోనియా గాంధీతో మాట్లాడిన సంభాషణ సైతం తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించుకుంది. సోనియా గాంధీని తన పరివారంతో కలిసిన తర్వాత, కెసిఆర్, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని అంశం పైన పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆనాటి టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని కెసిఆర్ ప్రకటించి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మోసం చేశారనే అంశంపై ప్రజలకు వివరించి చెప్పాలని అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది .అయితే ఆనాటి మోసం వల్ల దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పై పూర్తిస్థాయిలో అప నమ్మకం ఏర్పడింది” ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్లు” గా వ్యవహరించిన తీరును దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని కెసిఆర్ ను నమ్మలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. అప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల్లో కెసిఆర్ అంటేనే గుబులు పుట్టే పరిస్థితి దాపురించింది. పైగా, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలకు వెళ్తున్న సీఎం కేసీఆర్ ను నమ్మే పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి . ఇప్పటికే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఆర్జెడి, వామపక్ష పార్టీలు, బీహార్ సీఎం నితీష్ కుమార్ , యు పి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితర జాతీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే బలమైన ప్రతిపక్ష రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలని ముందుకు సాగుతున్నారు.

ఈ నేతలంతా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని సమర్థించడం తో, కెసిఆర్ ను పక్కన పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు . లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా వెళ్తేనే బిజెపిని అడ్డుకోవడం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పార్టీలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రగా వ్యవహరించనుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికారం చేపట్టే విధంగా ముందుకు సాగుతుంది. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రచారం కూడా ఊపందుకుంది. సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెల్లడించడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహం రెట్టింపు అయింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *