దొంగలు రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇళ్లు, వ్యాపారాలు, బ్యాంకులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కర్ణాటకలో ఓ దొంగ ప్రభుత్వ రోడ్డు రవాణా బస్సును దొంగిలించాడు. : బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.. కర్ణాటక రాష్ట్రంలోని చించోలి ఆర్టీసీ బస్టాండ్‌లో కేఏ38ఎఫ్ 971 నెంబరు బస్సు ఆగి ఉంది. మంగళవారం తెల్లవారుజామున 3-30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగిలించారు. గమనించిన సిబ్బంది గుల్బర్గా డీసీ వీరేష్‌కు సమాచారం అందించారు. దీంతో చించోలి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న తాండూరు పోలీసుల సహకారం అందించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించగా తాండూరు మండలం భూకైలాస్ వద్ద చోరీకి గురైన బస్సును గుర్తించారు. వెంటనే కర్ణాటక, తాండూరు పోలీసులు డీసీ, సిబ్బందితో కలిసి భూకైలాస్‌కు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3-30 గంటలకు బస్సు చోరీకి గురైందని, ఉదయం 6 గంటలకు ఫిర్యాదు చేయగా, మధ్యాహ్నం 3-30 గంటలకు తెలిసింది. పోలీసులు, అధికారులు 12 గంటల్లోనే స్థలాన్ని గుర్తించారు. అదే సమయంలో బస్సును హైజాక్ చేసిన నిందితులను విచారిస్తున్నారు. చోరీకి గురైన బస్సును గుర్తించడంలో సహకరించిన శివకుమార్‌కు కర్ణాటక పోలీసులతో పాటు తాండూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.