తెలంగాణ రాజకీయం.. గోడ దూకే వారికే కలిసొస్తున్న కాలం..!!

0
6

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గెలుపు గుర్రాల పేరుతో వలస వ‌చ్చిన నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏలాగైన అధికారం ద‌క్కించూ కోవాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తోంది. అందు కోసం గెలుపు గుర్రాలను త‌మ పార్టీలో చేర్చు కోవ‌టం కోసం రెడీగా ఉంది. ఏ పార్టీలో ఉన్నా.. ఆ లీడర్ గత చరిత్ర ఎలా ఉన్నా వదిలి పెట్టలేదు. ఆఫర్లు ఇచ్చింది.. వారి గొంతెమ్మ కొరిక‌ల‌ను సైతం త‌ల ఊపుతూ పార్టీలో చేర్చుకుంది. వీరిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ నేతలే. వారంద‌రిని తిరిగి సొంత గూటికి ర‌ప్పించ‌టంలో స‌క్సెస్ అయింది కాంగ్రెస్ నాయ‌క‌త్వం. అయితే వీరిలో ఎంత మంది విధేయంగా ఉంటారన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాంగ్రెస్ లో చేరిన‌వారిలో ముఖ్య నేతలు, కీలక నేతలు.. ద్వితియ శ్రేణి నేతలూ ఉన్నారు. వారందర్నీ అక్కున్న చేర్చుకొని ముఖ్య‌నేత‌లంద‌రికీ టికెట్లు ఇచ్చింది. పార్టీలో చేరగానే ఆ నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, ఎవర్ని ఎక్కడ్నుంచి బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చేయించి మరీ టికెట్లు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ కేటాయించిన టికెట్లను చూసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధిష్టానాలు ఒకింత కంగుతిన్న పరిస్థితి ఉంది. టికెట్లు ఇవ్వడమే కాదు.. కచ్చితంగా గెలిపించుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ రంగంలోకి దూకి ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరింది.

కాంగ్రెస్ రెండో జాబితాలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రానికి మునుగోడు టిక్కెట్ ఇచ్చారు. మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకు అవకాశం కల్పించారు. మైనంపల్లి హన్మంతరావు.. అత‌ని కుమారుడికి కూడ టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికీ టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరిన భువనగిరి నేత కంభం అనిల్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఆఫర్ చేసి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు. వీరిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలే. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఇప్పుడు అవకాశం కోసం వస్తే.. అంతకు మించి లీడర్లు లేరన్నట్లుగా కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోంది. ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు లాంటి ఫిరాయింపు దారులకు మొదటి జాబితాలోనే సీట్లు దక్కాయి.

జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రయత్నించారు. ఒకానొక సమయంలో టికెట్ ఆయనకే అన్న ప్రచారం చేసుకున్నారు. జడ్చర్ల ఇవ్వకపోయినా నారాయణపేట అసెంబ్లీ సీటు వస్తుందని ఎర్ర శేఖర్ భావించారు. రెండింట్లో ఆయనకు నిరాశే ఎదురైంది. జడ్చర్ల టికెట్ ను అనిరుధ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పై రగిలిపోతున్న ఎర్ర శేఖర్, పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నారు. మునుగోడు టికెట్ కోసం పాల్వాయి స్రవంతి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ ద‌క్కింది.

మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బండి రమేశ్ కు కూకట్ పల్లి సీటును ఖరారు చేసింది. వరంగల్ పశ్చిమ టికెట్ విషయంలో జంగా రాఘవరెడ్డి చివరి వరకు ప్రయత్నించినప్పటికీ…నాయిని రాజేందర్ రెడ్డికే టికెట్ దక్కింది. హుజురాబాద్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఒడితెల ప్రణవ్ కు టికెట్ ఖరారైంది.మహేశ్వరం నుంచి అనూహ్యంగా కిచ్చెన లక్ష్మారెడ్డి పేరును ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు స్థానాలను కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల సీటు ఖరారైంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ను విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు. అయితే ఈ టికెట్ అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఈ స్థానం నుంచి అజరుద్దీన్ ను బరిలోకి దించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, తన అనుచరులతో భేటీ కానున్నారు. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి టికెట్ ప్రకటనపై వడ్డేపల్లి అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుభాష్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మొదట్నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలోనే హైకమాండ్ ఉంది. మొదటి జాబితాలో కొత్త వారికి మొత్తం 12 సీట్లు వారికి దక్కగా.. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురికీ సీట్లు దక్కాయి. ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న వినయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూసుకుళ్ల రాజేష్‌రెడ్డి, సరిత, ఎ చంద్రశేఖర్‌, వేముల వీరేశం, కోట నీలిమలకు కూడా అభ్యర్థిత్వం లభించింది. రెండో జాబితాలో 15 మంది కొత్తవారికి చోటు లభించింది. ఇప్పటి వరకూ మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులకు కేటాయించిన కాంగ్రెస్.. ఇందులో 27 మంది కొత్త అభ్యర్థులే కావడం విశేషం. అయితే.. కొత్తవారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటి వరకూ పార్టీలో పాతుకుపోయిన.. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న వారికి.. యువనేతలకు టికెట్లు దక్కలేదని ఆరోపణలూ లేకపోలేదు.

తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత హోరోహోరీగా సాగబోతున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ప్ర‌చారం జోరందుకుంది. ఇలాంటి హోరాహోరీ పోరులో గుర్తించాల్సింది … కాంగ్రెస్ గెలిచే సీట్లు కాదు. గెలిచిన తర్వాత ఆ పార్టీ వైపు ఎంత మంది ఉంటారన్నది ముఖ్యం. హంగ్ అంటూ వస్తే.. కాంగ్రెస్ పార్టీ తట్టుకునే అవకాశం ఉండదని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపు గుర్రాలపేరుతో ఫిరాయించిన వాళ్లే. వారు తమకు బెస్ట్ ఆఫర్ ఏదనుకుంటే అందులోకి జంప్ చేస్తారు. ఒక‌వేళ సాధారణ మెజార్టీ వచ్చినా కూడా ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చినా కూడా తాము అడిగిన పదవులు ఇవ్వకపోతే పార్టీ ఫిరాయిస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

హంగ్ వచ్చినా.. సాధారణ మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేల్ని నిలుపుకోవడం అసాధారణమైన పని అవుతుంది. విధేయులకు టిక్కెట్లు ఇప్పించి గెలిపిచుకుంటే.. ఇంతలా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సీజన్ల వారీగా పార్టీలు మారేవారిని బలమైన నేతల పేరుతో తెచ్చి పెట్టుకుని టిక్కెట్లు ఇస్తూండటంతోనే ఈ భయం పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష మెజార్టీ సాధించడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. అసలు సమస్య అక్కడే వస్తుంది. గెలుపు గుర్రాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. వారంతా అధికారం, పదవుల లక్ష్యంతోనే వచ్చారు. వారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ప్యారాచూట్ నేతలతో కాంగ్రెస్ పార్టీ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో ఎంత మందిని తమ కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారనేది అస‌లు స‌మ‌స్య‌. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది పేరుతో గెలిచిన వారు అధికార పార్టీలోకి జంప్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. సీట్లు గెల‌వ‌డ‌మే కాదు గెలిచిన నేత‌ల‌ను కాపాడుకోవ‌డ‌మే పార్టీకి పెద్ద సవాల్ గా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here