TT Ads

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం*

*ఓటమి భయంతోనే తెరపైకి వన్ నేషన్ వన్ ఎలక్షన్*

*జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం*

అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌

*జమిలి ఎన్నికల విషయంలో కేసీఆర్ తమ వైఖరి స్పష్టం చేయాలి*

*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి*

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు. జమిలి ఎన్నికలపై కేంద్రానివి డ్రామాలన్నారు. సర్వేల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని..అందుకే ఓటమి భయంతో మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.


‘‘అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ జమిలి ఎన్నికలు మున్ముందు అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది’’ అని రేవంత్‌ ఆరోపించారు.
‘‘జమిలి బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం. ఈ దేశం రాష్ట్రాల సమూహం. కానీ ఒక పార్టీ చేతిలో అధికారం పెట్టుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తుంది’’ అని రేవంత్‌ ఆరోపించారు. ఈ కుట్రను నేను ముందుగానే ఊహించి లోక్ సభలో ప్రస్తావించి బీజేపీ ది వన్ నేషన్ వన్ పార్టీ విధానం అని నేను చెప్పా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం బీజేపీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కర్ణాటకలో గల్లీగల్లీ తిరిగినా.. ప్రధాని మోదీ, అమిత్‌షా 30 రోజులు ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదన్నారు.
పార్లమెంట్ లో మణిపూర్ ఘటనపై ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని.. మణిపూర్ అల్లర్లను పట్టించుకోలేదని విమర్శించారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశానికి భద్రత లేదన్నారు రేవంత్.


‘‘రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు నివేదికలు ఇచ్చాయి. సీ ఓటర్ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ కు 38 శాతం, బీఆరెస్ కు 31 శాతం ఓట్లు మాత్రమే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే మోదీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరమీదకు తీసుకువచ్చిందని” రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇండియా కూటమి వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకమన్నారు రేవంత్ రెడ్డి. అందుకే లోక్ సభ కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీ నుంచి వైదొలిగారన్నారు.
కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకు బీఆరెస్ మద్దతు ఇచ్చిందన్నారు.
బీజేపీ, బీఆరెస్ వేరు వేరు కాదు.. అవి ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సీఎం కేసీఆర్‌ లేఖ రాసిన రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎలక్షన్ కోడ్ తో రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకమని కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. ఆ లేఖ ను బి.వినోద్ కుమార్ ఇచ్చి చౌహన్ గారికి పంపించారన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్న కేసీఆర్… ఈ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు విస్పష్టంగా చెప్పాలి అని డిమాండ్ చేశారు

. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే బీజేపీ కి అనుకూలమనుకోవాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి. మాజీ రాష్ట్రపతి ని వన్ నేషన్,వన్ ఎలక్షన్ కమిటీకి చైర్మన్ గా నియమించి ఆ పదవికి కళంకం తెచ్చారు అని మోదీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు తెచ్చినా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ మెడలు వంచుతుందన్నారు రేవంత్ రెడ్డి.

 

 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *