TT Ads

*రేవంత్ రెడ్డిని కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు*

*కర్నాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు చూద్దాం*

*బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలా.. ఫామ్ హౌస్‌కు రావాలా*

*సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్*

కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంత రెడ్డి అంటావా? రేవంత్ రెడ్డిని కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. తెలంగాణను జుమ్మె రాత్ బజార్ లో అమ్మేసిన నువ్వా నా గురించి మాట్లాడేది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
రెండో దశ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం మెదక్, సంగారెడ్డిలలో నిర్వహించిన జనసభలలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలో.. ఫామ్ హౌస్‌కు రావాలో చెప్పండి.. కర్నాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో చూద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కర్నాటకు వచ్చి చూడాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ, పదేళ్లు గడిచినా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. అందుకే సోనియాగాంధీ మరోసారి పూనుకొని తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం. కర్నాటకలో చర్చకు రమ్మని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాల్ విసిరితే… మంత్రి కేటీఆర్ తోక ముడిచారు’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ పై కుట్ర జరిగిందని కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..బాంబులు పెడితే ఎక్కడైనా పిల్లర్లు భూమిలోకి కుంగుతాయా? ఆమాత్రం ఆలోచన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. మైనంపల్లి రోహిత్ ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుందన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సోనియమ్మ తెలంగాణ ఏ ఉద్దేశంతో తెలంగా ఇచ్చారో… ఆ ఉద్దేశం నెరవేరలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు జరగాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా మహిళలకు రూ.2500, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు..ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం ఇక కేసీఆర్ జీవిత కాలం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాల్సిందే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *