రేవంత్ మాటల్లో సీతక్క ….మళ్లీ కాంగ్రెస్ లో మొదలైన లొల్లి

0
4

సీతక్కే మా సీఏం …?

కాంగ్రెస్‌ గెలిస్తే సీతక్కే సీఎం అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటన చేయ‌టంతో ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయం వెడేక్కింది. దీని వెనుక ఉన్న వ్యూహమేంటి? అని ఆ పార్టీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కుర్చీలాట స్టార్ట్ అయ్యింది. పార్టీలో ఒకరికి ఒకరు చెక్‌ పెట్టుకునే దిశగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టడానికి సీఎం అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీలో సీనియర్లు తెరపైకి తీసుకువ‌చ్చారు. దాంతో ఆయన ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం భట్టికి చెక్‌ పెట్టడానికి సీతక్కను రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకువచ్చారని ప్ర‌చారం కొన‌సాగుతోంది.

దళితుడికి పోటీగా గిరిజన నేత సీతక్కను తెరపైకి తీసుకు రావడంతో పార్టీలో అటు సీనియర్లకు, ఇటు భట్టికి చెక్‌ పెట్టినట్టుగా ఉంటుందన్నది రేవంత్ వ‌ర్గం వ్యూహం అని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను రేవంత్‌రెడ్డి వ్యతిరేక శిబిరం తమకు అనుకూలంగా మార్చుకున్నది. ఖమ్మం సభలో భట్టిని రాహుల్‌ గాంధీ అభినందించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా ఏర్పాటు ఈ సభను రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గీయులు భట్టి అభినందన సభగా మార్చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని.. ఆమె పార్టీ మారుతున్నారని తెగ హడావిడి చేశారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లోకి రాబోతున్నారని వైరల్ చేశారు. ఉత్తమ్ సంగతి పక్కనపెడితే సీతక్క కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేసే ప్రసక్తే లేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

సీతక్క కుమారుడు సూర్య త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని.. ఆయన వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టిక్కెట్ కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. సూర్యకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని.. దీంతో సీతక్క కినుక వహించారని బీఆర్ఎస్‌కు చెందిన కొన్ని ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. సీతక్క త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని ప్రచారం షురూ చేశాయి. అయితే ఆ ఆరోపణలపై ఎమ్మెల్యే సీతక్క స్వయంగా స్పందించి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. కొంచెం ఓపిక పడితే నేతలందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు మాత్రమే సీతక్క లాంటి నేతను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా సాన్నిహిత్యంగా ఉండటం సహించలేని కొందరు నేతలు కావాలనే సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో సీతక్కపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదని.. అవసరమైతే పార్టీ సీతక్కను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీతక్క స్థానం ఏంటో అందరికీ క్లారిటీ వచ్చింది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం పదవి దళితుడైన భట్టికే దక్కుతుందన్న ప్రచారాన్ని రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే నాయకులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు రేవంత్‌రెడ్డి వేసిన పాచికగా సీతక్క పేరును తెరపైకి తెచ్చి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ‘తానా’ సభ వేదికగా సీఎం అభ్యర్థిగా సీతక్క పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించడం పార్టీలో సీనియర్లకు మింగుడు పడటం లేదు. రేవంత్‌ చేసిన ప్రతిపాదన భట్టికి చెక్‌ పెట్టడానికేనని పార్టీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా, టీడీపీ నుంచి తన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన సీతక్క అయితే తాను చెప్పినట్టు వింటుందన్నది ఆయన ఎత్తుగడ కావచ్చని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద సీతక్క పేరును రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకురావడంతో కాంగ్రెస్‌లో ఇంకో కొత్త పంచాయితీ రాజుకున్నట్టు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here