TT Ads

ఏవుంది రంగమార్తాండ లో..!? ఏమీ లేదు… నిజం! శూన్యం..!! ఏమీ లేని శూన్యం.. అవును.. శూన్యమంటే అన్నీ నిండుకున్న పరిపూర్ణత్వమే..!!
నేను అన్న అహంభావం సమసిపోతే.. ఖాళీ..! అదే ఏకత్వం..!!

ప్రారంభం లో “నేను నటుడ్నీ” అన్న చిరంజీవి గారి వాయిస్ ఓవర్ లో Lakshmi Bhupala గారి కవిత్వం వింటోంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అది పూర్తయ్యాక #AMB లో ప్రేక్షకులు ఈలలు వేయలేదు..!! లేచి నుంచుని చప్పట్లు కొట్టారు. నాతో సహా..!!
చాలు కదా.. ఒక కళాకారుడికి కావలసిన గౌరవాహారం..!!

జీవితమే ఒక రంగస్థలం అన్న మాట వింటూనే ఉన్నాం.. కానీ నటుడి జీవితమే రంగస్థలమైతే..!?
అసలు రంగస్థలం ఎక్కని సాధారణ సగటు మనిషీ నటుడే..!! అను నిత్యం బంధాల పాత్రల్లో జీవించే నటుడు ఈ మానవుడు..!

మన చుట్టూ ఉంటూ, మననంటిపెట్టుకున్న బంధాల గురించి ఒకటి రెండు చోట్ల నిష్కర్షగా చెప్పారు మాటల రచయిత ఆకెళ్ల శివప్రసాద్ గారు..!

ఎందుకో తెలియదు గానీ…కొన్ని సినిమా పాత్రల్లో మనని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది.. అప్పుడు కనిపించని హృదయ చెమ్మ చెంపని తడుముతుంది..! అక్కడ ప్రేక్షకుల గుండె తట్టిన దర్శకుడు వంద ఆస్కార్లు గెలిచినట్టే..!

బయట ఎన్నో తిరుగుళ్లు తిరిగి, తిని, తాగి ఏ అర్ధరాత్రో తను ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే అమాయకమైన భార్య మనోగతాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతం..!(ఇక్కడ నేను కథని చెప్పబోవట్లేదు)

ఒక్కొక్కరు ఒక్కో కోణం లో ఈ సినిమాని చూడొచ్చు..
నా కోణం లో… పిల్లలు, భర్త, భార్య, స్నేహం… ఇతరత్రా బంధాలన్నింటినీ దాటుకుని చూసిన తాత్వికత..!! ‘ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా నాటకం’ అన్న సత్యం తెలిసినా.. భ్రమలో ఉండటం..!! బంధాల ముసుగు లో బ్రతకడం..!!

కవులను, రచయితలను తలచుకోవడం నిజంగా గొప్ప సంతృప్తినిచ్చింది.
“అక్షరాలు పొడిగా చదవడం కాదు, వాటి వెనక ఉన్న తడిని చూడు” అన్న చోట.. నా అక్షరాలన్నింటినీ అమృతం తోనూ అందులో దాగున్న భావాల్ని ఆర్థ్రత తోనూ అద్దినట్టయింది..!!

మన జీవితాన్ని పెనవేసుకున్న ఒక బంధం చచ్చిపోతే ఏడుపు రాని క్షణాలుంటాయి. దుఖం లేక కాదు.. ఆ కన్నీరు గడ్డ కట్టి అలా స్థాణువులా ఉండటం..!

నా వ్యక్తిగతమే అయినా ఒక సంఘటన గుర్తొచ్చింది..
ఆరేళ్ల క్రితం నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయిందన్న వార్త ఆసుపత్రి నుండి రాగానే.. నా కంట ఒక్క కన్నీరు చుక్క రాలేదు. మిత్రుడి సహాయం తో అమ్మ దగ్గరికి వెళుతున్నా.
కార్లో నా మిత్రుడు, నేను ఇద్దరమే ఉన్నాం. నేను మౌనంగా ఉన్నాను. డ్రైవ్ చెస్తున్న మిత్రుడు కంగారు పడుతున్నారు. నేను ఒక్క కన్నీరు చుక్కైనా కార్చట్లేదని.. ఎక్కడ ఎలా స్పందిస్తానో అని అతడికి తెలియని ఆందోళన లో… “ప్లీజ్ దుఖాన్ని అణచుకొకండి.. ఏడ్ఛేయండి..” అంటున్నారు. కానీ ఆ సమయం లో కంట్లో కన్నీరు మనసులో దుఖం కూడా లేనంత ఖాళీ..! అమ్మ దహనసంస్కారాలు జరుగుతున్నాయి… అయినా.. ఊహూ! కన్నీరు లేదు..! ఆ సాయంత్రం ఇంటికొచ్చాక… ఎక్కడో గుండె లోతుల్లో చిన్న ఝలక్..! నేల పై పడుకుంటే కను కొసల నుండి ఒకే ఒక్క కన్నీటి చుక్క… ఇంతా ఇంతా…కన్నీటి మబ్బులు కమ్మిన తుఫాను లా భోరున వర్షించాయి కళ్లు.
ఆకాశం పిక్కటిల్లేలా నా రోదన..!

మళ్ళీ ఇక్కడ నేను కథ చెప్పడం లేదు… ఈ కథ లో నన్ను నేను ఎక్కడో చూసుకున్నట్టయింది.

మన తోడుండే మనిషి మన పక్కనే నీడల్లే ఉన్నప్పుడు పెద్దగా లెక్క చేయము. కానీ ఆ మనిషి భౌతికం గా దూరమైనప్పుడు… తెలుస్తుంది… తెలిసొచ్చెలా చేస్తుంది బా..ధ..!!

ఒక్కొక్క డైలాగూ ఒక్కో ఆణిముత్యం.. భద్రంగా గుండె ఫలకం పై ముద్రించుకుంటాయి.

ఒక్కో పాత్ర ఔన్నత్యం చెప్పలేనంత గొప్పగా మలచారు దర్శకులు. అతి సహజంగా మనవాళ్ళతోనో, మనం మాట్లాడుకుంటున్నట్టుగానో చిత్రీకరించారు.

బ్రహ్మానందం గారిని చూసాక, వారి నటనకి పాదాల పై సాష్టాంగ ప్రణామాలు అర్పించాలనిపించింది..!

రమ్యకృష్ణ గారు ఒక ఇంతి లా పూబంతి లా… అణకువ గల భార్య లా… ముఖ్యంగా కళాకారుడి మనసెరిగిన అర్ధాంగి లా.. ఆవిడ హావ భావాలు అత్యద్భుతం..!

ప్రకాష్ రాజ్ గారు జీవించిన నటన… హ్మ్…!! ఆయన ఆయనే అంతే..! తన నటనా జీవాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే మహా కెరటం లా తెరపై ఆవిష్కరించారు. మన హృదయాల్ని ద్రవింపజేసారు.

అనసూయ, శివాత్మిక, రాహుల్, ఆదర్శ్, ఆలీ..ఎవరి పాత్రల్లో వారు చక్కగా ఒదిగిపోయారు.

మన #మేస్ట్రో ఆరార్ ఇచ్చారు… ఆహా..!!!! అంతే. మాటల్లేవు. సినిమాకి ఆరో ప్రాణం సంగీతమే అన్న సత్యాన్ని మళ్ళీ ఋజువు చేసారు.

#సిరివెన్నెల గారి వెన్నెల సిరా అక్షారాల్లో మన హృదయాల పై వొంపిన తీరు.. అశృధారల్లా మన కంటి నుండి జాలువారకపోవు..!

నా మనో కంటికి మాత్రం #కృష్ణవంశీ #KrishnaVamsyగారే వారి విశ్వరూపాన్ని తెర పై ఆవిష్కరించినట్టుగా కనబడ్డారు..!
Yesss… he is the real #Rangamaarthaanda..!!!!!!!!

సినిమా చూస్తున్నంత సేపూ రెప్పలు ఎప్పుడు అల్లారుస్తామో.. ఎప్పుడు ఉచ్వాస నిచ్వాసలు తీసుకుంటామో మరిచిపోతాము. అందరి సంగతేమో గానీ… నేను మాత్రం అలానే చూసా..!!

ఎన్నో డైలాగ్స్ ఇక్కడ పంచుకోవాలని ఉంది…! కొన్ని… వీలైతే అన్ని సన్నివేశాల గొప్పతనాన్ని గురించి చెప్పాలని ఉంది…కానీ చెప్పను…

మీ పిల్లల తో, అమ్మ నాన్నల తో… స్నేహితులతో కలిసి వెళ్లి ఈ సినిమా చూడండి.

కళ అంతరించదు..
కళాకారుడు బీదవాడే కావొచ్చు. కానీ గొప్పవాడు. అందుకే కళాకారుడు భౌతికంగా మన మధ్య లేకున్నా..
మనతో.. మనలో జీవిస్తూనే ఉంటాడు..!!
నిజం…
కళాకారుడి నిష్క్రమణ కూడా అభిషేకం లా ఉండాలి..!

ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం జీవితం..
చివరకి మిగిలేది స్మశాన వైరాగ్యం కాదు..
స్మశాన వసంతం..!!

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *