TT Ads

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషాదాన్ని మరువక ముందే ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) (vani jayaram) కన్నుమూశారు. శనివారం  చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. కర్ణాటక సంగీతం ఔపోసన పట్టిన ఆమె, ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు చక్కగా పాడేవారు. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ప్రశంసలు అందుకున్నారు. వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. ఆమె మృతిపట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

*ఆల్‌ ఇండియా రేడియోతో పాపులర్‌:*

వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో మంచి గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టండి’ అని సూచించారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదట. ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న ఆమె.. ఆ తర్వాత టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణిలాంటి సంగీత విద్వాంసుల శిక్షణలో మరింత ఆరితేరారు. పదేళ్ల వయసులో తొలిసారి ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని అందుకున్న వాణీ(vani jayaram).. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించారు. రేడియోలో వరుసగా నాటకాలు వేయడం.. కవితలు చదవడం.. పాడటం.. దాదాపు పదేళ్ల పాటు నిరంతరం అదే ఆమె వ్యాపకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయారు. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు మళ్లింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని అవమానంగా భావించేది వాణీజయరాం కుటుంబం. అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్‌ పెట్టుకొని కంఠతా పట్టేవారు వాణీ (vani jayaram). అలా క్రమంగా సినిమాల్లో ఎలాగైనా పాటలు పాడాలని బలంగా నిర్ణయించుకున్నారామె. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

ఇలా ఓ కచేరీ చేస్తున్న సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే (vani jayaram singer) అవకాశమిచ్చారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్‌ హిట్టయ్యింది. దానికి తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం.. ఆ తర్వాత ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్‌.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారాయన. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు.

ఆమె గానానికి మూడు జాతీయ అవార్డులు పాదాక్రాంతం..

కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో ఆమె పాడిన పాటలకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘తెలిమంచు కరిగింది’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘ఒక బృందావనం’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె (vani jayaram) గళం నుంచి జాలువారిన ప్రతి పాటా సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా.. కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సహమే కారణమంటారు వాణీ (vani jayaram). తమకు పిల్లలు లేకున్నా.. ఆ లోటును సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుంటారామె. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు. ఇటీవలే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్‌ ప్రకటించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *