TT Ads

తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలలో కూడా కీడు చేసే ఆలోచన తనకు లేదని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాను ఏనాడు కూడా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఆంధ్ర ప్రజలు తెలంగాణకు వలస వెళుతున్నారని తన రచ్చబండ కార్యక్రమంలో గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారని వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. అటువంటప్పుడు తనకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఇష్టం ఉన్న వ్యక్తిగా, ఆ ప్రభుత్వానికి హాని చేయాలని ఆలోచన లేదని మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణలో పని చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ శ్రేణులకు రఘురామకృష్ణంరాజు సూచించారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ సిట్ పోలీసులు తనకు సీ ఆర్ పీ సీ 41 కింద నోటీసును అందజేసినట్లు తెలిపారు.

విచారణకు సహకరిస్తా… నోటీసులకు సమాధానం ఇస్తా

తెలంగాణ ప్రభుత్వంతో తనకు ఎటువంటి గొడవలు లేవని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు . తెలంగాణ సిట్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నీలి నీడలు తెలంగాణ అధికారులపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితో గొడవలు ఉన్నట్లుగా, తనకు కేసిఆర్ తో లేవన్నారు. తనను ఏమైనా చేస్తే సెటిలర్ల ఓట్లు జారిపోతాయని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు తెలుసునని అన్నారు. హైదరాబాదులో తాను కూడా ఒక సెటిలర్ నేనని, అటువంటి పనులను వారు చేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి, తన మాట వినే కొందరి అధికారులను ప్రభావితం చేసి ఇటువంటి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. శారదా పీఠం స్వామీజీతో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి తో పాటు తన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.

సాక్షి రాతలపై ఆగ్రహం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాను 100 కోట్ల రూపాయలు ఇవ్వ చూపానని సాక్షి దినపత్రిక లో రాయడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ తనకు జారీ చేసిన నోటీసులో 100 కోట్ల రూపాయల ప్రస్తావనే లేదని తెలిపారు . శుక్రవారం నాడు తెలంగాణ సిట్ పోలీసులు తనకు 41 సి ఆర్ పిసి కింద నోటీసులు అందజేస్తే, గురువారమే నోటీసులు ఇచ్చినట్లుగా సాక్షి దినపత్రికలో వార్త కథనం రాయడం, ఆ పత్రిక దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాక్షి దినపత్రికకు తనకు గురువారమే నోటీసు ఇచ్చినట్లుగా ఎవరు చెప్పారని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర చెప్పారా? అంటూ ప్రశ్నించారు. తాను ఒక హిందువునని, హిందూ మతాన్ని ఆచరిస్తానని తెలిపారు. అందుకే స్టిఫెన్ రవీంద్ర, జగన్మోహన్ రెడ్డి కలిసి దాడి చేస్తున్నారన్నారు. సిట్ తనకు నోటీసులు ఇవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా, పిటీషన్ ను కొట్టి వేసినట్లుగా 15 రోజుల ముందే సాక్షి దినపత్రికలో వార్త రాశారన్నారు. వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి ఎలా శాసిస్తున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముఖ్యమంత్రి హోదా గురించి మాట్లాడడం లేదని, వ్యక్తిగా అక్రమ సంపాదనతో జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పేపర్ గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.

శరత్ చంద్రారెడ్డి, కనికారెడ్డి, విజయసాయిరెడ్డి గురించి రాసే దమ్ముందా?

తన గురించి అవాకులు చవాకులు రాస్తున్న సాక్షి దినపత్రికకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, ఆయన సతీమణి కనికా రెడ్డి, విజయసాయిరెడ్డి అక్రమాల గురించి ఎందుకు రాయడం లేదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కనికా రెడ్డి తన విమానాలలో వందల కోట్ల రూపాయలు తరలించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని, సాక్షి దినపత్రికలో వాటి గురించి ఎందుకు వార్తలు రాయడం లేదన్నారు. విశాఖపట్నం భూములను దోచుకున్నారని, సాక్షి దినపత్రికలో ఏనాడు ఆ వార్తల ప్రస్తావనే లేదన్నారు. దసపల్లా భూకుంభ కోణం లో విజయసాయి రెడ్డికి 1500 కోట్ల రూపాయలు ఆదాయం లభించనుందన్నారు. ఇన్నాళ్లు అల్లుడిని బూచిగా చూపించారని, ఆ అల్లుడు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదన్నారు. దస్పల్లా భూ కుంభకోణం గురించి మా పార్టీకి చెందిన రెడ్డి రాజులు చెప్పి చూసినప్పటికీ, మాటిచ్చాం క్లియర్ చేద్దామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్లు తెలిసిందన్నారు. దస్పల్లా భూములను కొన్నవాళ్లంతా సర్వనాశనం కావడం ఖాయమన్నారు. విశాఖపట్టణాన్ని దోచేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, కానీ సాక్షి దినపత్రికలో ఏనాడు ఆ వార్తలు ఉండవన్నారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు అక్షింతలు వేసినా, భూతద్దం పెట్టి వెతికిన సాక్షి దినపత్రికలో ఆ వార్త కనిపించదన్నారు.

ఫోటోలు దిగితే కలిసి నేరం చేసినట్టా?

ఎవరైనా అభిమానంతో వచ్చి ఒక ఫోటో దిగుతామని అంటే… ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా ఫోటో దిగితే అతడు ఏదైనా నేరం చేస్తే, ఫోటో దిగిన పాపానికి కలిసి చేసినట్టు అవుతుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాను ఢిల్లీలో ఉంటున్నప్పటికీ ప్రతిరోజు తనని 20 నుంచి 25 మంది కలిసి అభిమానంతో ఫోటోలు దిగుతారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎదుర్కొంటున్న నందకుమార్ ఎవరో తనకు తెలియదన్నారు. కలిసి ఫోటో దిగినంత మాత్రాన, అతనితో తనకు సంబంధాలను అంట గట్టి సాక్షి దినపత్రికలో అరపేజీ ప్రత్యేక కథనం రాస్తారా అంటూ మండిపడ్డారు. పబ్లిక్ లైఫ్ లో ఉండి ఫోటోలు దిగడం వేరని, ప్రైవేటుగా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఫోటోలు ఉండడం వేరన్నారు. ఈ రెండింటికి సాక్షి దినపత్రికకు తేడా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ లో కీలక నేత దత్తాత్రేయ హోసు బోలే తో పాటు పక్కనే ఉన్న మరొక స్వామీజీతో కలిసి ఫోటో దిగితే, ఇష్టం వచ్చిన రాతలు రాయడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. 32 ఆర్థిక నేరాల కేసుల్లో 420 గా వేల కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి నేతృత్వంలో నడుస్తున్న సాక్షి దినపత్రిక ఇంతకంటే గొప్పగా ఏమి రాస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని దొంగ అని అంటే అక్షరం ముక్క కూడా సాక్షి దినపత్రికలో రాసుకోలేదన్నారు. పోలీస్ అధికారులను ప్రభావితం చేస్తూ, పక్క రాష్ట్ర ప్రభుత్వం తనకు నోటీసులు ఇస్తే ఇష్టం వచ్చినట్లు రాతలు రాయిస్తావా ? అని ఫైర్ అయ్యారు.

 

 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *