TT Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున వేళ పార్టీలు నువ్వా -నేనా అన్నట్లు ప్రచారం మొదలు పెట్టేశాయి. ఓటర్లకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి… ప్రత్యర్థులను బలహీన పరిచే వ్యూహాల్లో పార్టీలు త‌ల‌మున‌క‌ల‌వుతున్నాయి. ఆందు కోసం సెకండ్ లెవల్ లీడ‌ర్లపై పార్టీలు దృష్టి పెట్టాయి. దీంతో వారికి డిమాండ్ పెరిగింది. దీంతో సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ల‌దే ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా త‌యారైంది.

హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తే, బీఆర్ఎస్ దాన్ని మించి మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ 5వందలకే గ్యాస్ సిలిండర్ అంటే బీఆర్ఎస్ 4 వందలకే సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో అధికార పార్టీ నుంచి తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త‌ర్వ‌లో ఖరారు చేయనుంది. బీజేపీ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ పార్టీలో ఇంత వరకు ఉలుకు పలుకు లేదు.

పార్టీ టికెట్‌ తమకే వస్తుందనే ధీమాతో కొందరు ఆశావహులు ఎదురుచూస్తున్యారు. ఇప్పటికే టికెట్ దక్కించుకున్న అధికార పార్టీ నేతలు ప్రత్యర్థుల బలబలాలను ఆంచనా వేస్తూ, ఆందుకు అనుగుణంగా పావులు క‌దుపుతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఆయా పార్టీల్లో బలమైన నాయకులు ఎవరు..? వారి బలహీనతలు ఏమిటి..? వారు పార్టీ ఫిరాయిస్తే గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే అంశాలపై బేరీజు వేసుకుంటున్నారు. సెకండ్ గ్రెడ్ లీడ‌ర్ల‌ను, మండల, గ్రామ స్థాయి నేతలతో బేరసారాలకు దిగుతున్నారు. గ్రామ, మండలస్థాయి నేతలకు వారి స్థాయికి అనుగుణంగా 3 లక్షల నుంచి 5లక్షల రూపాయ‌ల వరకు నజరానాలు ఇవ్వ‌టానికి సైతం వెన‌క‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. కొంచెం పలుకుబడి, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు అయితే 20లక్షలు కూడ ఇచ్చేందుకు ఆయా పార్టీల నేత‌లు రెడీ అవుతున్నారు. నగదుతో పాటు పార్టీల్లోకి వచ్చిన తర్వాత పదవులు కట్టబెడతామని హామీలు ఇస్తున్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సెకండ్ లెవ‌ల్ లీడ‌ర్ల‌కు గాలం వేసేందుకు ప‌క్క ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆధికార పార్టీ కోసం కష్టపడ్డా తమకు ఎలాంటి ప‌ద‌వి, ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశంతో ఉన్న వారిపైన‌ కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్ చేసింది. ఒక్కో లీడ‌రుకు వారి స్థాయిని బ‌ట్టి 15 లక్షల వ‌ర‌కు ఇచ్చి వారి సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ద్వితీయశ్రేణి నేతలు కోరే గొంతేమ్మ కోరిక‌ల‌ను సైతం తీర్చేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

త‌మ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు తమ నుంచి జారిపోకుండా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. వారిని మచ్చిక చేసుకుని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పిస్తామని, ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో కొనసాగే విధంగా పార్టీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో ప్రచారాలు, హామీలు ఎలా ఉన్నా ప్రజలను పోలింగ్ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓటు వేయించేది మాత్రం ఈ సెకండ్‌ లెవల్‌ నేతలే. ఎలక్షన్ రింగ్‌లో వీరిది కీలక పాత్ర అందుకే వారిని కలుపుకొని వెళ్లాలని ఈ మధ్య పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. వారిని మచ్చిక చేసుకోవాలన్నారు. కొందరు అలుగుతారని అలాంటి వారితో మాట్లాడి ప్రచారం చేయించాలన్నారు. ఈగోకు పోతే అసలుకే మోసం అవుతుందని హెచ్చ‌రించారు. పార్టీ గెలుపోటములు సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ల‌పై ఉండ‌డంతో వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌ధాన పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *