గుంటూరులో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ సందర్భంగా సంక్రాంతి కానుకల పంపిణీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యం కల్పించాలని, తెలుగుదేశం శ్రేణులు వారికి అనివిధాలా అండగా నిలబడాలని కోరారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం తరపున ఆర్థిక సహాయంతో పాటుగా ఇతర అన్నివిధాలా పార్టీ నాయకత్వం ఆదుకుంటుందని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. పార్టీ సభలలో తొక్కిసలాట జరిగి వరుసగా కార్యకర్తలు దుర్మరణం పాలవడం తీవ్ర విషాదకరమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.