కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి

0
6

బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhana Reddy) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భాజపాలో కొనసాగిన ఆయన.. సొంత పార్టీని స్థాపించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragati Paksha) పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. అయితే, పార్టీని వీడొద్దని ఆయన్ను భాజపా నాయకత్వం బుజ్జగించింది. అయినా.. ఆ పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కొత్త పార్టీవైపే మొగ్గు చూపారు. గాలి జనార్దన్‌ కొత్త పార్టీ పెట్టడం వల్ల కొన్ని వర్గాల ఓట్లపై ప్రభావం చూపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ.6కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు గాలి జనార్దన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణంగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సొంతంగా పార్టీని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన భార్యతో కలిసి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలతో మమేకయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhana Reddy)పై గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ఆయనతోపాటు 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరులో జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేశారు. నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం 2015 జనవరి 20న కొన్ని షరతులతో కూడిన బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ 2020లో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు 

. విచారించిన న్యాయస్థానం.. ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చంటూ ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో ట్రయల్‌ కోర్టులో విచారణ జాప్యం కావడం పై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here