TT Ads

ఉద్యోగులు కేసీఆర్  తొత్తులు కాదు, ఆత్మబందువులు: బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నాంపల్లి లోని టీఎన్జీవో హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండటానికి ఉద్యోగులే ప్రధాన కారణమని   అన్నారు

ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ ఉపాధ్యాయులు పడే శ్రమ ఫలితంగానే భారతదేశ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందుతుందని, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని  కవిత గుర్తుచేశారు. ఉద్యోగులపై పూర్తి నమ్మకముందని సీఎం కేసీఆర్ అనేక సార్లు తెలిపారని, ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రజలకు చేరవేసి అమలు చేస్తారని  , భారత దేశంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని  ఆమె పేర్కొన్నారు.

కేసీఆర్ కిట్, భూ సంస్కరణలు లాంటి అనేక కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయంటే దానికి కారణం ఉద్యోగులే అని  కవిత  చెప్పారు. భారతదేశంలో ఏ అవార్డులు వచ్చినా, తెలంగాణకే మొదటి మూడు అవార్డులు వస్తున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, దీనికి కేసీఆర్ గారి ఆలోచనతో పాటు, ఉద్యోగుల కష్టం కూడా ముఖ్యమన్నారు. వ్యవసాయ శాఖలో 15 వేల మంది కొత్త ఉద్యోగులు, ఇంజనీరింగ్ విభాగంలొ 10వేల మంది కొత్త ఉద్యొగులు, ఇంకా ఇతర శాఖల్లో కొత్త ఉద్యోగాలను నియమించి అన్ని శాఖలను బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాశ్వత ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంతొ పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత ఉద్యోగుల ఫిట్ మెంట్ ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్  ప్రభుత్వమని  కవిత కొనియాడారు

ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు అన్న బండి సంజయ్ విమర్శలకు ఘాటుగా స్పందించిన  కవిత, ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు కాదని, ఆత్మబందువులని స్పష్టం చేసారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా,బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కానీ తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల భర్తీని సైతం బండి సంజయ్ తప్పు పడుతూ, యువకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ మీద చర్చ జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి, బీహెచ్ ఈఎల్ లాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని ఆమె ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్ద్దీన్‌, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేనీ, టీఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *