సిద్ధాంతాలు గాలికి….. టిక్కెట్టు రావాలి …ఎమ్మెల్యే కావాలి..!!

0
11

టికెట్ ఇచ్చినోడే బాస్‌… లేదంటే డ్యాష్ .. డ్యాష్‌

తెలంగాణ‌లో ఇప్పుడు ఎన్నిక‌ల సీజ‌న్ … ఇక్క‌డ అంతా టికెట్ల గోల‌… ఎవడు టికెట్టిస్తే వాడే బాస్.. లేదంటే డ్యాష్‌… డ్యాష్ .. అప్ప‌టి వ‌ర‌కు పొగిడిన నోటితోనే క‌డిగి పారేస్తారు. టికెట్టు దొరక్కపోతే జంపింగ్ లు కామ‌న్ . జ‌స్ట్ కండువా మారుతోంది. మిగిత‌దంతా సేమ్ టూ సేమ్ … నో సెంటిమెంట్… ఓన్లీ ప‌వ‌ర్ పాలిటిక్స్…. నాకు మ‌నుషుల‌తో ప‌నిలేదు… ఓన్లీ మాసిన బ‌ట్ట‌ల‌తోనే అనే ఓ సినిమా డైలాగ్ ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల‌కు స‌రిగ్గా స‌రిపోతుంద‌న‌టంలో ఏలాంటి సందేహం లేదు.

వారికి సిద్ధాంతాలు ఏమీ లేవు… జ‌నం ఇస‌డించుకుంటార‌న్న ఆలోచ‌న లేదు.. వారిదంతా ఒకటే సిద్ధాంతం, టికెట్ కావాలి .. ఎమ్మెల్యే అయిపోవాలి… అధ్య‌క్షా అనాలి… ద‌ట్స్ ఆల్.. ‘నాకు టికెట్టు ఇవ్వరా, అయాతే నా కొడుక్కి ఇవ్వు, లేక‌పోతే నా బిడ్డకు ఇవ్వు, లేదంటే ఇద్దరికీ ఇవ్వు… కాదంటే వాడు పిలుస్తున్నాడు .. వీడు పిలుస్తుండు అంటూ జంపింగ్ ల‌కు రెడీ.. ఆ త‌ర్వాత కబ్జాలు, అక్రమ సంపాదన, సెటిల్మెంట్లు … ఆంతా వారి ఇష్టం.. ఏదంటే అది చేసుకోవచ్చు… ఏ పార్టీ చూసిన ఇదే తీరు… ఓటర్లకు పంచిన డబ్బు, టికెట్ల కోసం ఖర్చు డబ్బు వారికి జ‌స్ట్ పెట్టుబడి మాత్ర‌మే. తరువాత డబ్బే డ‌బ్బు.. ఇక మరీ కేసీయార్ వచ్చాక ఎమ్మెల్యేలు నయా న‌వాబుల వ‌లే త‌యార‌య్యారు.

గ‌తంలో పార్టీలో చేరిన సీనియర్లు .. పార్టీకి రాజీనామా చేయడమో.. సైలెంట్ గా ఉండటమో చేస్తున్నారు. పార్టీలోకి ఇప్పుడు చేరిన సెకండ్ గ్రెడ్ నేతలకు మాత్రం టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీ కోసం పని చేసిన వారు గోడ దూకేందుకు సై అంటున్నారు. కాంగ్రెస్‌ వర్సెన్‌ టీఆర్‌ఎస్‌ అనే మూడ్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఘోరంగా ఓడిపోతే ఉన్న పరువు ఎక్కడ పోతుందో అనే భయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే సీనియ‌ర్లు జంకుతున్నారు. వీరంతా ఎప్పటికప్పుడు తాము పార్టీ మారడం లేదని ఖండిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు.. ఎంత నిజాయితీగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గెలుపు గుర్రాల పేరుతో వలస వ‌చ్చిన నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏలాగైన అధికారం ద‌క్కించూ కోవాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తోంది. అందు కోసం గెలుపు గుర్రాలను త‌మ పార్టీలో చేర్చు కోవ‌టం కోసం రెడీగా ఉంది. ఆ లీడర్ గత చరిత్ర ఎలా ఉన్నా వదిలి పెట్టలేదు. ఆఫర్లు ఇచ్చింది.. వారి గొంతెమ్మ కొరిక‌ల‌ను సైతం త‌ల ఊపుతూ పార్టీలో చేర్చుకుంది. అయితే వీరిలో ఎంత మంది విధేయంగా ఉంటారన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాంగ్రెస్ గెలిచే సీట్లు కాదు. గెలిచిన తర్వాత ఆ పార్టీ లో ఎంత మంది ఉంటారన్నది ముఖ్యం. హంగ్ అంటూ వస్తే.. కాంగ్రెస్ పార్టీలో నిల‌బ‌డే వారు ఎంత మంది అనేదే క‌ష్ట‌మ‌ని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపు గుర్రాలపేరుతో ఫిరాయించిన వాళ్లే. వారు తమకు బెస్ట్ ఆఫర్ ఏదనుకుంటే అందులోకి జంప్ చేయ‌టంతో సిద్ద‌హ‌స్తులు. సాధారణ మెజార్టీ వచ్చినా కూడా ఇదే ప‌ద్ద‌తి . అధికారంలోకి వ‌చ్చినా కూడా తాము అడిగిన పదవులు ఇవ్వకపోతే పార్టీ ఫిరాయిస్తామని బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చేయ‌టంలోను వారిని మించిన వారు లేర‌నేదే నిజం అనేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

వాస్తవానికి మొదట్నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలోనే హైకమాండ్ ఉంది. అయితే.. కొత్తవారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటి వరకూ పార్టీలో పాతుకుపోయిన.. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న వారికి.. యువనేతలకు టికెట్లు దక్కలేదని ఆరోపణలూ లేకపోలేదు. మ‌రోవైపు పార్టీలో చేరగానే ఆ నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, ఎవర్ని ఎక్కడ్నుంచి బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చేయించి మరీ టికెట్లు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ కేటాయించిన టికెట్లను చూసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధిష్టానాలు ఒకింత కంగుతిన్న పరిస్థితి ఉంది. టికెట్లు ఇవ్వడమే కాదు.. కచ్చితంగా గెలిపించుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ రంగంలోకి దూకి ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరింది

తెలంగాణ కోసం పోరాడిన బ్యాచ్ ఇప్పుడు బీఆర్ఎస్ లో మళ్లీ కనిపిస్తోంది… అయిన్ప‌టికి వారికి కౌలు రైతులు పట్టరు… మేడిగడ్డ మీద కిక్కుమనరు… ‘విపక్షాల గుండెల్లో పేలబోయే మేనిఫెస్టో’ అని పదే పదే బాకా ఊదుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వారు చేసిన వాటి గురించి చెప్పుకోరు, సరికదా కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీల మీద విమర్శలు చేస్తున్నారు. తమ సిక్స్ గ్యారంటీల మీద మాట్లాడటం తప్ప బీఆర్ఎస్ ఫెయిల్యూర్ల మీద విమర్శల్లేవ్, చివరకు మేడిగడ్డ వంటి మేజర్ ఇష్యూస్ కూడా వదిలేసి, కేవలం పాజిటివ్ క్యాంపెయిన్ మాత్రమే చేస్తోంది కాంగ్రెస్… బీజేపీకి ఈ చిక్కులేమీ లేవు, దానికి చెప్పుకోవడానికి సూపర్ మేనిఫెస్టో లేదు, కేసీయార్‌ను తిట్టిపోసేందుకు దోస్తానా అడ్డం వ‌స్తోంది.… ఏదో అప్పుడప్పుడూ సగటు ఓటరుకు పట్టని డబుల్ ఇంజన్ అనే డ‌బుల్ డోస్ ఇంజెక్ష‌న్ ఇస్తుంటారు.

హంగ్ వచ్చినా.. సాధారణ మెజార్టీ వచ్చినా ఎమ్మెల్యేల్ని నిలుపుకోవడం అసాధారణమైన పని అవుతుంది. విధేయులకు టిక్కెట్లు ఇప్పించి గెలిపిచుకుంటే.. ఇంతలా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సీజన్ల వారీగా పార్టీలు మారేవారిని బలమైన నేతల పేరుతో తెచ్చి పెట్టుకుని టిక్కెట్లు ఇస్తూండటంతోనే ఈ భయం. గెలుపు గుర్రాల పేరుతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి అన్ని పార్టీలు . వారంతా అధికారం, పదవుల లక్ష్యంతోనే వచ్చారు. వారిని కాపాడుకోవడానికి మరో యుద్ధం చేయాల్సి వ‌స్తోంది. ఓ రకంగా ప్యారాచూట్ నేతలతో డేంజరస్ గేమ్ ఆడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో ఎంత మందిని తమ కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారనేది అస‌లు స‌మ‌స్య‌. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది పేరుతో గెలిచిన వారు అధికార పార్టీలోకి జంప్ చేయ‌డం కామాన్. సీట్లు గెల‌వ‌డ‌మే కాదు గెలిచిన నేత‌ల‌ను కాపాడుకోవ‌డ‌మే అన్ని పార్టీల‌కు పెద్ద సవాల్ గా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here