TT Ads

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది నేత‌లు, ప్ర‌ముఖులు బాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ఒక్క వైసీపీ నేతలు మినహా అందరూ చంద్ర‌బాబు అరెస్టును ఖండించారు. అయితే వీరిలో కొంద‌రు చంద్రబాబును స్వయంగా కలిసి సంఘీభావం తెలిపేలా టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా చంద్రబాబును క‌లిశారు. దీంతో ఈ విష‌యం పోలిటీక‌ల్ గ్రౌండ్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే రానున్న‌ రోజుల్లో కూడా ఊహించని విధంగా ములాఖత్ ల్లో వీఐపీలు బాబును పరామర్శించి మద్దతు తెలిపేలా టీడీపీ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు వినికిడి. వచ్చే వారమంతా రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టే రాజకీయాలు తిరిగేలా దేశం నేత‌లు ప్లాన్ చేసుకుంటున్నట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయకపోవడం వెనుక కూడ ప‌క్క రాజకీయ వ్యూహం ఉందని రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు.

మరో వైపు టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంది. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారంటూ టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గాలు కేంద్రంగా బాబుతో మేము అనే నినాదంతో జ‌నాల్లోకి వెల్లేలా దేశం నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. చంద్ర‌బాబును అన్యాయంగా వేధిస్తున్నారని ప్రజలు అనుకునేలా చేసి వారిలో సానుభూతి క‌లిగిస్తే టీడీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంద‌ని భావిస్తున్నారు. దీంతో రానున్న‌ వారం రోజులూ ఈ కేసు పైనే ప‌బ్లిక్ లో జోరుగా చర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు సీఎం జగన్ అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతను కుట్రపూరితంగా జైల్లో పెట్టే ప్రయత్నం చేశారని కోర్టు ద్వారా చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేత‌లు.

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీలో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలని జగన్ భావిస్తున్నాడని.. నిజంగా జగన్ యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, త‌న‌ను తెలంగాణ బోర్డర్‌లో అడ్డుకున్న విధానం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిప‌డ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని పవన్ ఆరోపించారు.
ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చని నాయకుడు జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం కాబట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని కూడా స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలని.. వైసీపీ తన గోతిలో తనే పడిందని అన్నారు. ఆంధ్రాలో వైసీపీకి దరిద్రపు అలవాటు ఉందని.. నిజం మాట్లాడితే చంద్రబాబు ఏజెంట్ అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలేమైనా సుద్ద పూసలా అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు అరెస్టు వైసీపీకి చాలా మైనస్ అవుతోంద‌ని స్ప‌ష్టం చేసారు బండిసంజ‌య్..

చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వరుస ట్వీట్లు.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సూక్తులు వల్లిస్తూ.. ఆయన చేస్తున్న ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని.. పోరాటమే శరణ్యం అంటూ.. సిక్కుల గురువు గురుగోవింద్ సింగ్ సూక్తి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లూథ్రా లాంటి సీనియర్ న్యాయవాది ఇలాంటి ట్వీట్ చేయడం టీడీపీ శ్రేణులను కొంత కలవరానికి గురిచేసింది. లూథ్రా ట్వీట్‌ ప్రకారం చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదా? అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. రాజకీయ వర్గాల్లోనూ ఆ ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారన్న వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు కుంగిపోవడం అనేది ఉండదని.. రాజకీయ వేధింపులను కూడా రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొంటారని అంటున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేరని ఆయనకు తెలుసున‌ని.. అందుకే… వీలైనంత గా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయం ఊహించని విధంగా ఉంటోందని చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సానుభూతి పవనాలు వీస్తే.. ఆయా పార్టీలకు తిరుగు ఉండదు. పైగా చంద్రబాబు గతంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో చేశానని.. చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అడిగితే.. .. ప్రజలు కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయని అంచనా వేస్తున్నారు. మ‌రోవైపు ప్రభుత్వం మ‌రిన్ని కేసులు పెట్టి.. లోకేష్ .. పవన్ కల్యాణ్ ను అరెస్టు చేసి… ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తుందన్న ప్రచారం కూడా బయట జోరుగా సాగుతోంది. ఈ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో ఎవ‌రూ చిత్త‌వుతారో..ఎవ‌రూ విజేత‌లుగా నిలుస్తారో కాల‌మే నిర్ణ‌యించ‌నుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *