TT Ads

మీ విజయాలే జాతికి సంపద
• అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి… మీకు మీరే రోల్ మోడల్‌ కావాలి
• జయాపజయాలను సమానంగా స్వీకరించండి
• పరాజయంలోనే జయం దాగి ఉంది
• ప్రతికూల పరిస్థితులే మరింత బలంగా మారుస్తాయి
• ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ 
మీకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధిపథంలో దూసుకుపోవాలి.

.జీవితంలో తమకు తామే ఆదర్శప్రాయులుగా ఎదగాలి

. అపజయాలను, విజయాలను సమానంగా తీసుకోవాలని…

అపజయం ఎదురైందంటే సగం విజయం సాధించినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. అపజయంలోనే జయం దాగి ఉంది

ధనార్జనే ధ్యేయంగా కాకుండా అందరికీ గుర్తుండిపోయే జీవితాన్ని కొనసాగించాలి 

హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ నిర్వహించారు. శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పవన్ కల్యాణ్  హాజరయ్యారు.

ఈ సందర్బంగా పవన్‌కళ్యాణ్‌మాట్లాడుతూ… “భారతదేశ సమగ్రాభివృద్ధికి చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ పాత్ర కీలకమని మీ విజయాలు జాతి పురోభివృద్ధికి దోహదం చేస్తాయి. మోతీలాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్ చైర్మన్‌ అండ్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌ మోతీలాల్‌ ఓశ్వాల్‌ మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను . ఒక తెలివితేటలుగల వ్వక్తి ముందుగా చేసే పని.. ఒక తెలివితక్కువ మనిషి చివరిగా చేస్తాడు. తెలివితేటలు కలిగిన వ్యక్తి భవిష్యత్తును ముందే ఊహించే శక్తికలిగి ఉంటాడు అంటారు. ఎప్పటినుంచో నాలో ఒక సందేహం ఉండేది… ఎందుకు కొద్దిమంది మాత్రమే విజయాలను అందుకొంటున్నారు… మిగతా వారు ఎందుకు సాధించలేకపోతున్నారు అని.
• రాజకీయాలు నా దేశం కోసం
నేను ఎంత వరకూ విజయం సాధించానో నాకు తెలియదు. కానీ సినిమాల్లో నటించడం నేను జీవించేందుకు.. కానీ రాజకీయాలు మాత్రం నా దేశానికి… నా జాతి కోసమే. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని. విజయం కోసం ఎదురు చూసే వ్యక్తులు తప్పనిసరిగా కామ, క్రోధ, మదమాత్సర్యాలను అధిగమించాలి. ఇక రెండోది… మహాత్మా గాంధీ మొదలు అందరూ అచరించిన విధంగా… పని చేయకుండా వచ్చే సంపద, మనస్సాక్షి లేని సంతోషం, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నీతి లేని వాణిజ్యం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగం ఎరుగని భక్తి ఎన్నటికీ విజయతీరాలకు చేర్చలేవు. కాబట్టి, ఇవే నా ప్రాధమిక ఆలోచనా సరళి, జీవన విధానం. వీటిని సాధించటం అంత తేలిక కానప్పటికీ నేను దీన్ని సాధించేందుకు కృషి చేస్తూనే ఉంటా.
సినిమా ఎప్పుడూ నేను కోరుకొంది కాదు. నా ఆలోచనలు, ఆశయాలు వేరే రీతిన ఉంటాయి. సీఏ విధ్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ జీవితంలో విజయాలు సాధించాలి. మీ వ్యక్తిగత విజయాలు జాతికి సంపదగా భావించండి. నా మొదటి సినియా అపజయం తర్వాత నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు. కానీ నా విజయాల గ్రాఫ్‌ ఏడవ సినిమా తర్వాతే పెరిగింది.
మీరు దాదాపు 1.5 బిలియన్ల ప్రజలతో పోటీపడాల్సి ఉంది కాబట్టి మీ ముందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో విజయశిఖరాలను అధిరోహించాలి. మీరు కలగన్న అవకాశమే రావాలని ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పురోగమించాల్సి ఉంటుంది. అపజయాలు, విజయాలు సర్వసాధారణం. కఠిన, ప్రతికూల పరిస్థితులే మిమ్మల్ని మరింత రాటుతేలేలా చేస్తాయని మరువవద్దు. ఈ పరిస్థితులే మీకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిమ్మలని తయారు చేస్తాయి. నేను ఓడిపోయినట్లుగా భావించలేదునేను నా జీవితంలో ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశాను. ఆ తర్వాతే “గబ్బర్‌ సింగ్‌” సినిమా విజయం దక్కింది. దీంతోపాటు మీరుతెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే… మీకు వచ్చిన విజయం వెనక వేల మంది కృషి ఉంటుందని మరువద్దు. వారికి మీ ధన్యవాదాలు తెలపడం మరిచిపోకూడదు. అది తల్లిదండ్రులు కావచ్చు మరెవ్వరైనా కావచ్చు. ఇది ఒక విజయం సాధించాలి అనుకొనేప్రతీవ్యక్తికీఅవసరం.అపజయాలను, విజయాలను సమానంగా స్వీకరించాలి. నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తాను. కానీ.. ఎప్పటికీ నేను ఓడిపోయినట్టుగా భావించలేదు. ఒక అపజయంకూడా సగం విజయం అనే భావన నింపుకున్నాను. నేను కనీసం ప్రయత్నం చేశానని అనుకొంటాను. మీ అందరికీ నా విన్నపం ఒక్కటే… అపజయం ఎదురైనా ఎన్నడూ చింతించవద్దు… అలానే ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.
• మార్పు ఒక్క రోజులో రాదు
నేను రాజకీయాల్లోకి రాక ముందు కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రారంభించాను. కానీ మార్పు ఒక్క రోజులో రాదని తెలుసుకోవాలి. ప్రజలలో మార్పు తీసుకురావడం అంత సులభం కాదు. చాలామంది జనాలకు తక్షణ విజయాలు కావాలి.. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడీల్స్ మాదిరి. మార్పు సాధించాలంటే ఓపిక, సహనం ఉండాలి. ఇది సాధించాలంటే దశాబ్దాలు పట్టవచ్చు. ప్రస్తుతం నా మిషన్‌ యువతను శక్తివంతులుగా తీర్చిదిద్దటమే. రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ గడిపే బదులు, దీన్ని మార్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడం అవసరం.
• భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి
నేటి యువతకు బలమైన ఆలోచనలతోపాటు బలమైన దేహధారుఢ్యం కూడా అవసరమే.. స్వామీ వివేకానంద చెప్పినట్టు… వంద మంది బలమైన యువకులు ఉంటే మార్పు తీసుకురావడం తేలికే.. నేటి యువతరానికి విద్యతోపాటు కండబలం కూడా అవసరమే.. అందుకు మార్షల్‌ అర్ట్స్ లో శిక్షణ పొందవచ్చు. ఇదేదో పక్కవాణ్ని కొట్టడానికి కాదు.. మన బలాన్ని… భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం ఇవి అవసరం. స్వామీ వివేకానంద, భగత్‌ సింగ్‌ లాంటి వారిని రియల్‌ హీరోలుగా భావిస్తాను. నేను ఎక్కువ అభిమానించే వ్యక్తుల్లో వనజీవి రామయ్య.. ఎవరికోసమో ఎదురుచూడకుండా లక్షల మొక్కలను నాటి పర్యావరణాన్ని, మన భూమిని కాపాడేందుకు నిరంతరం కృషి చేశారు. అలాగే ఒకే వ్యక్తి.. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్‌ ముంపుకు గురయ్యినప్పుడు వందల మంది ప్రాణాలను కాపాడారు. ఇలాంటి వ్యక్తులే నాకు రియల్‌ హీరోలు. నేను ఎల్లప్పుడూ ఆదాయం సమకూర్చుకొనే జీవితాన్ని కోరుకోను… అనుభూతితో కూడిన జీవితాన్నే కోరుకుంటాను… నేను డబ్బు కోసం అర్రులు చాచను. నన్ను ఎవరైనా విజయం సాధించే మనిషిగా ఉంటావా..? లేదా విలువలు కాపాడే వ్యక్తిగా జీవిస్తావా అంటే రెండూ కోరుకొంటా అనే చెబుతాను.
• ఎవర్నీ గుడ్డిగా అనుసరించవద్దు
సీఏ చదువుతున్న విద్యార్తులూ… మీరు కాకపోతే ఎవరు జీవితంలో విజయం సాధిస్తారు.. చెప్పండి. మీరందరూ 2 వేల సంవత్సరం తర్వాతే జన్మించి ఉంటారు… మీ పెద్దవాళ్లు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినా కానీ వారి మాటలు తప్పు అని మీరు నిరూపించాలి. అలాగే.. గుడ్డిగా ఎవరినీ అనుసరించవద్దు. మీకు మీరే రోల్ మోడల్‌ గా ఎదగటానికి కృషి చేయాలి. మీలో అంతర్గతంగా ఉన్న మీ టాలెంట్‌ను వెలికితీయండి. వాటిని బేరీజు వేసుకొని విజయతీరాలను చేరాలని ఆకాంక్షస్తున్నాను. మీ వ్యక్తిగత విజయాలే జాతికి సంపద. మీరు విజయం సాధించడం ద్వారా మీరు జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తుంచుకోవాలి” అని శ్రీ పవన్‌ కళ్యాణ్‌  సీఏ విద్యార్థులకు సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *