
మెరుగైన ప్రజా రవాణా కోసం…*
*టి.ఎస్.ఆర్టీసీ – ఎల్ అండ్ టి మెట్రో పరస్పర ఒప్పందం*
హైదరాబాద్ నగరవాసులకు సౌకర్యవంత ప్రయాణం
*సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్
విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో జంటనగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎల్ అండ్ టి మెట్రో, టి.ఎస్.ఆర్టీసీ పరస్పర ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ తెలిపారు.
ఎల్ అండ్ టి ప్రతినిధులు శ్రీ మురళీ వరద రాజన్ (చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్) శ్రీ రిషికుమార్ వర్మ (ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్) శనివారం సాయంత్రం బస్‌భవన్‌లో ఎం.డి భేటీ అయి ఆ మేరకు సంబంధిత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఎం.ఒ.యు కాపీలను పరస్పరం అందజేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎం.డి మాట్లాడుతూ, ఈ అవగాహన ఒప్పందంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణీకులకు మరింత సులువైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్గుతుందన్నారు.
మెట్రో స్టేషన్ల అనుసంధానంగా బస్సులను నడపడంతో పాటు సర్వీసుల సమయపట్టిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అలాగే, మెట్రో స్టేషన్ల దగ్గర సమాచార కేంద్రాలు, అనౌన్స్ మెంట్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు.
ఇక మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ప్రజా రవాణా వ్యవస్థలో సదుపాయాల కల్పన విషయమై పరస్పరం చర్చించుకోవడం జరిగిందన్నారు.
ఇదొక చారిత్రాత్మక ఒప్పందంగా భావిస్తున్నట్లు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
- వాహనాల రద్దీ, ట్రాఫిక్ జాంల వంటి ఆటంకాలను నివారించడానికి ప్రజా రవాణా సేవల్ని వినియోగించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనిక్టెవిటీతో సేవలు కొనసాగనున్నాయని వెల్లడించారు.
ఈ ఒప్పందం కోసం సహకరించిన హైదరాబాద్ మెట్రో రైల్ టీంలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సంస్థ ఛైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.ఎల్.ఎ గారి మార్గ నిర్దేశంలో సంస్థ అభ్యున్నతి కోసం పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు.
కాగా, మెట్రో, ఆర్టీసీతో అనుసంధానం ఒక మంచి నిర్ణయంగా తాము భావిస్తున్నామని ఎల్ అండ్ టి ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.