.ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు .. చికిత్స..!!

0
3

ఫ్యాటీ లివర్

”నేను ఆల్కహాల్ తాగను.. మరి నా లివర్ ఎందుకు పాడైంది?’’ ఇలాంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లివర్ దెబ్బ తినడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన జీవన శైలి కూడా మారుతోంది. వ్యాయామం చేయకపోవడం, అధిక క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం లాంటి చర్యలతో కొన్ని జబ్బులు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటినే లైఫ్ స్టైల్ డిసీజెస్‌గా పిలుస్తున్నారు.

ఇలాంటి జీవన శైలికి సంబంధించిన వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్‌డీ) కూడా ఒకటి.

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి?

కాలేయంలో కొన్ని రకాల మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అతిబరువు ఉండేవారు, ఊబకాయుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ రుగ్మత సోకినవారిలో కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంది.

అయితే, తొలి దశల్లో దీని వల్ల పెద్దగా ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, వ్యాధి ముదిరేకొద్దీ పరిస్థితులు తీవ్రం అవుతాయి. ఒక్కోసారి కాలేయం పూర్తిగా దెబ్బతినొచ్చు. లేదా లివర్ సిర్రోసిస్ లాంటి స్థితికి కూడా వెళ్లే ముప్పు ఉంటుంది.

ఈ పరిస్థితికి ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఇది వచ్చాక ఆల్కహాల్ తీసుకుంటే వ్యాధి మరింత ముదిరిపోతుంది. అందుకే ఫ్యాటీ లివర్ రుగ్మత ఉండేవారు మద్యపానం, సిగరెట్లను పూర్తిగా పక్కనపెట్టేయాలి.

యూకే లివర్ హెల్త్ సెంటర్ సమాచారం ప్రకారం.. కొవ్వు లేకపోవడం లేదా స్పల్ప మొత్తంలో కొవ్వు ఉండే లివర్‌ను ఆరోగ్యకర కాలేయంగా చెబుతారు.

అయితే, ఇక్కడ కణాల్లో నిల్వ ఉండే ఫ్యాట్ 5 శాతం కంటే ఎక్కువకు పెరిగినప్పుడు కాలేయ రుగ్మత వచ్చినట్లుగా పరిగణిస్తారు.

దీన్ని మొదట్లోనే అదుపు చేయకపోతే, ఫ్యాటీ లివర్‌గా మారిపోతుంది. బ్రిటన్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారి సంఖ్య 65 కోట్లకుపైనే ఉంది. ఇది మొత్తం జనాభాలో 8.8 శాతం వరకూ ఉంటుంది. మరోవైపు రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతోంది.

బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, లివర్‌లో విపరీతంగా పెరిగే కొవ్వుతో మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

మధుమేహంతో బాధపడేవారికి ఫ్యాటీ లివర్ వస్తే, గుండె పోటు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.

ఫ్యాటీ లివర్:-*
ఫ్యాటీ లివర్ దశలు ఇవీ..

*సింపుల్ ఫ్యాటీ లివర్ లేదా స్టెయటోసిస్:-*

ఈ దశలో కాలేయంలో కొవ్వు కణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ లేదా నొప్పి ఉండదు. చాలా మందిలో ఈ దశలో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు.

కాబట్టి అసలు తమ శరీరంలో ఫ్యాటీ లివర్ మొదలైందని చాలా మందికి తెలియదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే.. భవిష్యత్‌లో కొన్ని సమస్యలు రాకుండా ముందే మనం అడ్డుకోవచ్చు.

స్టెయటోహెపటైటిస్:

ఈ దశలో లివర్‌లో కొవ్వు కణాల స్థాయిలు పెరగడం మొదలవుతుంది. ఇప్పుడే ఇన్‌ఫ్లమేషన్ కూడా వస్తుంది. మరోవైపు దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేసుకునేందుకు లివర్ కూడా ప్రయత్నిస్తుంటుంది.

అయితే, దెబ్బ తింటున్న కణజాలం పెరిగేకొద్దీ, దాన్ని బాగుచేసే శక్తి కూడా తగ్గుతుంది. ఒక్కోసారి దీని వల్ల కాలేయంపై పుండ్లు, బొడిపెలు కూడా రావొచ్చు. పుండ్లు పెద్దవయ్యేటప్పుడు ఫిబ్రోసిస్‌ వస్తుంది.

*ఫిబ్రోసిస్:-*

ఈ దశలో కాలేయంపై మచ్చలు లేదా పుండ్లు పెద్దవవుతాయి. ముఖ్యంగా కాలేయంలోని రక్త నాళాలకు సమీపంలో ఈ పుండ్లు, మచ్చలు వస్తాయి. అయితే, అప్పటికీ కాలేయం ఆరోగ్యంగానే పనిచేస్తుంది. ఆ సమయానికి మనం సరైన చికిత్స తీసుకుంటే, కొన్ని వ్యాధుల ముప్పులను ముందుగానే అడ్డుకోవచ్చు.

అయితే, కాలేయంపై పుండ్లు లేదా మచ్చలు మరింత పెరిగేటప్పుడు.. సిర్రోసిస్ వస్తుంది.

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి

దీన్ని నాలుగో దశగా చెబుతుంటారు. ఇప్పుడు కాలేయం సాధారణంగా పనిచేయడం కష్టం అవుతుంది. దీనికి సంబంధించిన లక్షణాలు మనలో స్పష్టంగా కనిపిస్తాయి.

చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. పక్కటెముకల్లో నొప్పి కూడా మొదలవుతుంది.

ఈ దశలో కాలేయంపై మచ్చలు, పుండ్లకు చికిత్స అందించడం కాస్త కష్టం. అయితే, పరిస్థితి మరింత చేయి దాటకుండా కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మొదటి దశ నుంచి నాలుగో దశకు చాలా కొద్ది మంది మాత్రమే వెళ్తుంటారు. చివరి దశకు వెళ్లడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి 

ఎవరికి ముప్పు ఎక్కువ?
ఊబకాయులు లేదా అతిబరువు ఉండేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం లేదా ముప్పు ఎక్కువగా ఉంటాయి.

మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, జీవక్రియ రేటు సమస్యలు ఉన్నా ఈ వ్యాధి రావొచ్చు. పొగతాగడం కూడా ముప్పు తెచ్చిపెడుతుంది.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తొలి దశల్లో మనకు పెద్దగా లక్షణాలు కనిపించవు. అందుకే ఎప్పటికప్పుడు మనం వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

అయితే, ఫిబ్రోసిస్ దశలోనే పొత్తి కడుపులో కుడివైపు కాస్త నొప్పి రావడం మొదలవుతుందని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

ఒక్కోసారి తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మంతోపాటు కళ్లు కూడా ఒక్కోసారి పసుపు రంగులోకి మారుతుంటాయి.

*గుర్తించడం ఎలా?*
అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్టుతో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను గుర్తించొచ్చు. రక్త నమూనా ద్వారా లివర్ ఫంక్షన్ టెస్టు కూడా నిర్వహించి కాలేయం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

ఒకసారి ఫ్యాటీ లివర్ వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత, అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఫిబ్రోస్కాన్ లాంటి ప్రత్యేక అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

కొన్నిసార్లు బయాప్సీ కూడా చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. అంటే లివర్‌లో కొంత కణజాల నమూనాను తీసి పరీక్షల కోసం పంపిస్తారు.

ఒక్కోసారి సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్‌ కూడా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు.

చికిత్స ఏమిటి?
ఫ్యాటీ లివర్‌కు సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఔషధాలతోపాటు కొన్ని జీవన శైలి మార్పులనూ వైద్యులు సూచిస్తుంటారు.

ముఖ్యంగా ఎత్తుకు సరిపడా స్థాయిలో బరువు ఉండాలని వైద్యులు చెబుతుంటారు. ఆహారంలోనూ కొవ్వు స్థాయిలు తగ్గించుకోవాలని సూచిస్తారు. పళ్లు, కూరగాయలు ఎక్కవగా తీసుకోవాలని చెబుతారు. పంచదార, ఉప్పు, కూల్‌డ్రింక్‌లు కూడా తగ్గించుకోవాలని చెబుతారు.

బయట చిరుతిండ్లను తినేకంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవడం మంచిది. శరీరాన్ని పెద్దగా కదిలించకుండా అలానే గడిపితే, వ్యాయామం చేయాలని కూడా సూచిస్తారు. దీని వల్ల మనం బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ నిర్ణయాలన్నీ మీకు మీరుగానే తీసుకోకూడదు. వైద్యులను మొదట సంప్రదించాలి.

ఎత్తు, బరువు, వయసు, జెండర్, లైఫ్ స్టైల్, అలవాట్లు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వైద్యులు సూచనలు చేస్తుంటారు.

ఫ్యాటీ లివర్ సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యూట్రిషనిస్టు డాక్టర్ ప్రణీత అశోక్ మాట్లాడారు. ”నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల మన జీవక్రియా రేటులో మార్పులు వస్తాయి. ఫలితంగా బరువు మరింత పెరగడం, టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు లాంటివి మనలో కనిపిస్తాయి’’అని ఆమె చెప్పారు.

”చికిత్సలో భాగంగా మనకు భిన్నరకాల ఔషధాలను వైద్యులు సూచిస్తుంటారు. మధుమేహం ఉండేవారికి ఒకరకమైన మందులు, రక్తపోటు ఉండేవారికి మరొక రకమైన మందులు సూచిస్తుంటారు. అయితే, ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి’’అని ఆమె వివరించారు.

”అన్నం, రొట్టెలు లాంటి వాటికి బదులుగా ఎక్కువగా పళ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. వ్యాయామం తప్పకుండా చేయాలి. నిద్ర నాణ్యత మెరుగుపరచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఫలితంగా వ్యాధి ముదరకుండా ఉంటుంది’’అని ప్రణీత తెలిపారు.

అప్పుడప్పుడు ఉపవాసంతోపాటు రోజూ వ్యాయామం చేయడంతో ఫ్యాటీ లివర్ ముదరకుండా అడ్డుకోవచ్చని ఇల్లినాయిస్ యూనివర్సిటీ చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here