TT Ads

చిన్న విషయానికి రెండు కుటుంబాల మధ్య వివాదం పెరిగి పెద్దయింది. ఆ రెండు కుటుంబాలకూ వేర్వేరు రాజకీయ పార్టీల నేపథ్యం ఉండడం విధ్వంసానికి దారి తీసింది. బీజేపీ కార్యకర్త ఇంటిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబం కర్రలు, రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ నేత ఇల్లు, ఆటో ధ్వంసం అయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజారాం.. బీజేపీ కార్యకర్త, వికలాంగుడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి ఇంటికి సమీపంలోనే బీఆర్‌ఎ్‌సకు చెందిన కిర్చుల్‌ కృష్ణ, అతని సోదరుడు మోహన్‌, వారి తల్లిదండ్రులు నర్సింగ్‌, జయమ్మ నివాసముంటున్నారు. పద్మాలయ అంబేడ్కర్‌ నగర్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్‌ స్థలంపై కొద్దికాలంగా కన్నేసిన కృష్ణ.. దాన్ని ఎలాగైనా ఆక్రమించాలని ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ ప్రయత్నాలను రాజారాంతో పాటు బస్తీవాసులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు నిర్వహించారు. అప్పటి నుంచి రాజారాం, కృష్ణ కుటుంబాల మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఆగస్టు 15న ఆ రెండు కుటుంబాల మద్య మరోసారి గొడవ జరిగింది.

బస్తీవాసులు కలుగచేసుకోవడంతో సద్దుమణిగింది. ఆ తర్వాత ఆగస్టు 16న రాజారాం ఇంటి వెనుకాల ఉన్న టైల్స్‌ వాడుకునే విషయంలో మరోసారి రెండు కుటుంబాల మధ్యా గొడవ జరిగింది. ఇరు కుటుంబాలు రోడ్డు మీద పరస్పరం దుర్భాషలాడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి.. కిర్చుల్‌ కృష్ణ, అతని సోదరుడు మోహన్‌, తల్లిదండ్రులు నర్సింగ్‌, జయమ్మ రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న కర్రలతో రాజారాం కుటుంబసభ్యులపై దాడి చేశారు. వారిని విచక్షణరహితంగా కొట్టారు. ఆ దాడిలో రాజారాం బావమరిది దేవరాజ్‌, భార్య లలిత, కుమారుడు ఆకాష్‌ తలలు పగిలాయి. అతడి సోదరి రాజమణికి గాయాలయ్యాయి. దేవరాజ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడితో పాటు మిగతావారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలో కృష్ణ భార్య చేతికి కూడా గాయం అయింది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణ కుటుంబ సభ్యులందరినీ అదుపులోకి తీసుకున్నారు.

రెచ్చిపోయిన కృష్ణ బామ్మర్దులు….

కృష్ణ భార్య చేయి విరిగిన విషయం బోరబండలో ఉన్న ఆమె సోదరుడు సాయికి తెలిసింది. అతను మరికొంతమందిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి చేరుకున్నారు. రాజారాం, అతని కుటుంబ సభ్యులంతా అపోలో ఆస్పత్రిలో ఉండగా.. ఇంట్లో ఆయన పెద్ద కోడలు, తొమ్మిది నెలల మనుమరాలు మాత్రమే ఉన్నారు. సాయి అతడి అనుచరులు రెచ్చిపోయి వారి ఇంటిపై రాళ్లతో దాడులు నిర్వహించారు. రాజారాం ఆటోను ధ్వంసం చేశారు. ఇంటి మొదటి అంతస్తు, రెండో అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. లోపల ఉన్న రాజారాం కోడలిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు సాయిని, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. బస్తీలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాజారాం ఇంట్లో పోలీసులకు గంజాయి ప్యాకెట్లు లభ్యం అయ్యాయి. సాయి అతడి అనుచరులు గంజాయి సేవించి దాడి చేశారని ఈ ప్యాకెట్లు వారికి సంబంధించినవని స్థానికులు పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *