TT Ads

శాసనసభ ఎన్నికలలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వడంతో పాటు, రెండు ఎంఎల్ స్థానాలను సిపిఐకి ఇస్తామని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి సోమవారం నాడు వచ్చారు. ఆయనతో పాటు ఎఐసిసి పరిశీలకులు దీపా దాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శి విష్ణుదాస్ కూడా వచ్చారు. వీరు సిపిఐ నేతలతో భేటీ అయి పొత్తుల గురించి చర్చించారు. ఎఐసిసి ఆదేశాలతో వచ్చిన కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, పల్లా వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహ, బాలనర్సింహా, వి.ఎస్.బోస్ ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరుపున పొత్తులకు సంబంధించి చేసిన ప్రతిపాదనలను అంగీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎఐసిసి ఆదేశాల మేరకు సిపిఐ,కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి ఒక ఒప్పందానికి వచ్చామన్నారు. దేశంలో మోడీ కారణంగా, రాష్ట్రంలో కెసిఆర్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్ డి ఎ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐల మధ్య స్పష్టంగా పొత్తు ఖరారైందని, కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని ఎఐసిసి ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల తరువాత రెండు ఎంఎల్ స్థానాలను సిపిఐకి ఇస్తామన్నారు. సెక్యూలర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేలానే ఉద్దేశంతో పేద, సామన్యుల సమస్యలను చట్టసభలలో ప్రస్తావనకు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే శాసనమండలిలో సిపిఐకి చెందిన ఇద్దరు సభ్యులను నియమిస్తామని వెల్లడించారు. తమపై రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామాలు, పరిస్థితులను సిపిఐ నేతలకు వివరించామని తెలిపారు. పేదల తరపున నిలబడేందుకు, పెద్దమనుసుతో ముందుకురావాలని తాము చేసిన విజ్ఞప్తికి సిపిఐ ముందుకు వచ్చినందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలంటే కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని వివరించామన్నారు. మునుగోడు శాసనసభ అంశంపై కూడా చర్చ జరిగిందని, సిపిఐ ప్రతిపాదించే వారికి చట్టసభలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. సిపిఐ(ఎం)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

*ఈ స్నేహబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ః దీపా దాస్ మున్షీ*

ఎఐసిసి పరిశీలకురాలు దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ సిపిఐ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల్లో పరస్పర అవగాహన ఒక చిరస్మరణీయమైన రొజుగా అభివర్ణించారు. సిపిఐ, కాంగ్రెస్ స్నేహబంధాన్ని కొనసాగిస్తామని, ఈ ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తున్నామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పోటీ చేస్తుందని, అక్కడ కాంగ్రెస్ శ్రేణులు సిపిఐకి మద్దతినిస్తారని, తమ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో సిపిఐ తమకు మద్దతునిస్తుందని తెలిపారు. ఈ రోజు తెలంగాణకు అలాగే, ఇండియా కూటమికి చిరస్మరణీయమైన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణలో సిపిఐ, కాంగ్రెస్ కలిసి ఉన్నాయని, ఈ స్నేహం మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిపిఐ కామ్రేడ్ ధన్యావాదాలు, కాంగ్రెస్, సిపిఐ స్నేహం వర్థిల్లాలి అని దీపా దాస్ మున్షీ పేర్కొన్నారు.
*బిఆర్ ఎస్ చేతితో దగాపడిన ప్రజానీకాన్ని విముక్తి చేయడమే లక్షం: నారాయణ*

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ బిఆర్ చేతిలో దగాపడిన ప్రజానీకాన్ని విముక్తి చేయడమే తమ లక్షమన్నారు. కెసిఆర్ నియంత పాలన కొనసాగడం సాధ్యం కాదని, నమ్మిదగా పడిన ప్రజలకు విముక్తి కలిగిచేందుకు సిపిఐ,కాంగ్రెస్ ఐక్యంగా నిలబడిందన్నారు. భారతదేశాన్ని కాపాడడమే ప్రధాన లక్షమన్నారు. భారతదేశంలో మోడీ నాయకత్వం పాలన చూశామని, మోడీకి వ్యతిరేకంగా నిలబడే, పనిచేసే సంస్థలు, ముఖ్యంత్రులపైన దాడులు చేస్తున్నారని విమర్శించారు. చత్తీస్ కాంగ్రెస్ పార్టీ మంచిగా పరిపాలన అందిస్తున్నప్పటికీ కేంద్రంలోని బిజెపి దాడి చేయిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలలో ఉండే సమర్ధవంతమైన నాయకత్వం, ముఖ్యమంత్రులపైన సిబిఐ,కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వ్యతిరేకులపైన దాడలకు పాల్పడడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. బిఆర్ ఎస్ , బిజెపి,ఎంఐఎంలకు తేడా లేదని, ఇవన్నీ కుక్క మూతి పిందలేనని, ఒకే తాను ముక్కలు అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయం పేరుతో ఇండియా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి పెట్టేందుకు బిఆర్ ఎస్, ఎంఐఎం ప్రయత్నిస్తోందని, తద్వారా పరోక్షంగా, ప్రత్యేక్షంగా మరోసారి బిజెపిని గెలిపించేందుకు ప్రయత్నంచడమేనని నారాయణ విమర్శించారు. లిక్కర్ కేసులో బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితను రేపు,మాపో అరెస్ట్ చేస్తామని చెబుతూ అరెస్ట్ చేయడాన్ని మానేసి, బండి సంజయ్ బండి కట్టి ఇంటికి పంపించారని చెప్పారు. బిజెపి,బిఆర్ ఎస్ పరస్పర అవగాహన నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేయలేదని విమర్శించారు. సిసోడియకు మించిన దొంగలు బయట ఉన్నారని, అయినా సిసోడియను అరెస్ట్ చేశారన్నారు. పెద్ద పెద్ద కుంభకోణాల ఆరోపణలు ఉన్న వారి జోలికి పోవడం లేదని, పూర్తిగా కక్షసాధింపుచర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బిఆర్ ఎస్, బిజెపి, వైసిపికి చెందిన మనుషులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. దేశాన్ని,ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడడమే తమ లక్షమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను కాపాడాలని, ఫామ్ రాజకీయాన్ని ఓడించాలన్నారు.

అనివార్య పరిస్థితుల్లో ఒకే స్థానంలో పోటీ ః కూనంనేని కూనంనేని సాంబశివరావు

మాట్లాడుతూ రాజకీయ , భౌతిక, అనివార్య పరిస్థితిలో తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ కలిసి సిపిఐ ఒకే స్థానం కొత్తగూడెం నుండి పోటీకి అంగీకరించామని తెలిపారు. తమ స్నేహ బంధంతో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందన్నారు. చట్టసభలలో కమ్యూనిస్టుల గొంతు వినిపించాలని ,కష్టజీవులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చే సానుకూల పవనాలు కనిపిస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా సానుకూలత, కనిపిస్తోందని చెప్పారు. సుప్రీం కోర్ట్, ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సర్వేలు యథేచ్చగా జరుగుతున్నాయని, కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి భయపడి, కృతిమంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత బిఆర్ ఎస్ ప్రభుత్వం పోయి, కర్నాటక తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజల గుండెల్లో ఉన్నదని, ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల అభిప్రాయాన్ని, తమ అనివార్యతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో మార్పు రావాలని, ఈ మార్పు కేంద్రంలోని మార్పునకు దోహదపడాలని అన్నారు. మునుగోడులో కూడా బిజెపి ఏజెండాతోనే స్నేహాన్ని అందించామని, బిఆర్ ఎస్, బిజెపి అనుంగ మిత్రులుగామారిన పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ తో స్నేహంగా ఉన్నామని, తాము సహజమ్రితులమని చెప్పారు. ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉండడం, తెలంగాణలో తీవ్రమైన ఒత్తిడి, ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, ఈ విషయాన్ని తాము గతంలో బిఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసే పరిస్థితి లేదని, ఆందోళనకు చేయాలంటే గృహ నిర్భందాలు అని, ముందస్తు అరెస్ట్ లు అని, బిట్రీష్ వాడు ఇచ్చిన సమ్మె హక్కు కూడా లేకుండా చేశారన్నారు. ఆర్ లాంటి సంఘాలు లేకుండా చేశారని, మున్సిపాలిటీ, పంచాయతీ సంఘాల ఉద్యోగాలు తీసేశారని గుర్తు చేశారు. నరేంద్రమోడీ మతపరమైన అంశాలపైన మతోన్మాదాన్ని రాజ్యాంగాన్ని, సమైఖ్యతకు, లౌకకవాదానికి తూట్లు పొడుస్తూ, నిరంకుశ అధిపతిగా మోడీ ఉంటే, ఆయనకు ఏమీ తక్కువ లేకుండా ఇక్కడ (తెలంగాణ) కెసిఆర్ ఉన్నారని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో నిర్బంధాలు విధించినట్టుగానే రాష్ట్రంలో కూడా నిర్బంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది మళ్లీ నిర్భందాలను ఎదుర్కొనేందుకు కాదని, స్వేచ్ఛ తో కూడిన , బంగారు, వెండి కాదని, స్వేచ్ఛ, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారు కోరుకున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో అవి లేవన్నారు. సిపిఐ(ఎం)తో సిపిఐ మిత్రత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్ కూడా ఈ స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ అనేక సమస్యలు ఉన్నాయని, రాబోయే కాలంలో కాంగ్రెస్ కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

*ప్రజా ప్రభుత్వం వచ్చేందుకు కృషిః చాడ*

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ ఒక జాతీయ పార్టీగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ ప్రధాన పాత్రను పోషించిందని, ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో బరిలో కాంగ్రెస్, సిపిఐ సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *