TT Ads

కాంగి రేసులో కొత్త టెన్షన్ .. !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సీట్లకు భారీ డిమాండ్ పెరిగింది. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లోనూ జోష్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో ఆ పార్టీలో అభ్యర్థులను ప్రకటించక ముందే కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి షూరువైంది. ఆ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుంచి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా కీల‌క పాత్ర పోషిస్తున్న వారి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గ‌ట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అన్నీ వ‌ర్గాల నేత‌లు ఆసక్తి చూపుతున్నారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు పార్టీలో కుటుంబానికి రెండు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక అసెంబ్లీ సీటు కోసం 20 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే…ఏకంగా 1035 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రేటర్ పరిధిలోని సీట్ల నుంచి పోటీ చేసేందుకు 263 మంది పోటీ పడుతున్నారు. రెండు జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాలకు…ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. హస్తం పార్టీ తరపున కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతున్నారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి 16 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అసెంబ్లీ సీట్లలో నాలుగో వంతు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కొడంగల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు సీటుకు…ఏకంగా 31 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయిస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సెప్టెంబరులో 40 నుంచి 50 మంది అభ్యర్థులతో తొలిజాబితాను రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్ మధ్య రెండు సీట్ల అంశం చర్చకు వచ్చింది. కుటుంబానికి రెండు సీట్ల అంశం ఇపుడెందుకంటూ… ఉత్తమ్ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గం కోసం ఉత్తమ్ పద్మావతి దరఖాస్తులు సమర్పించారు. కోదాడ,హుజుర్ నగర్ స్థానాలకు… పోటీగా జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇదే ఉత్తమ్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో రెండు సీట్లపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడ సీరియ‌స్ అయిన‌ట్లు వినికిడి. అసలు సర్వే ఎలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తున్నపుడు…ఈ ప్రక్రియ అంతా ఎందుకని ప్రశ్నించిన‌ట్లు తెలిసింది . కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు…రెండు సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, అమె తనయుడు, కరీంనగర్ స్థానానికి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు. ఆమె కొడుకు గాంధీభవన్ లో దరఖాస్తులు సమర్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా మూడు స్థానాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. జానారెడ్డి తనయులు రఘువీర్, జై వీర్ లు రెండు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ని ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని కోరారు. సెప్టెంబరు 2న మరోసారి భేటీ కానుంది పీఈసీ. మొదటి విడతలో 40 నుంచి 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులనే ప్రకటించేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటనకు ముందు డీసీసీ అధ్యక్షుల సలహాలు స్వీకరించనుంది స్క్రీనింగ్ కమిటీ. ఈ సమావేశం తర్వాత….స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం కానుంది. డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించనుంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు సీట్లను…బీసీలకు కేటాయించేలా హస్తం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులతోనూ…పొత్తులపై చర్చించనుంది. ఒక వేళ పొత్తులు కుదిరితే…2004 తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేయనున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *