
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకి శనివారం తెల్లవారు జామున పోలీసులు చేరుకున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో బస్సు నుంచి బయటకి పిలిచి అరెస్ట్ నోటీసు ఇచ్చారు.
ఆ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు, పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.మ రోవైపు ఇదే కేసులో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించే సమయంలో వివరాలన్నీ ఇస్తామని పోలీసులు చంద్రబాబుతో చెప్పారు.
డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ముందుగా శిబిరం నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించారు.
చంద్రబాబుకు ఇచ్చిన సీఆర్‌పీసీ నోటీసులో క్రైమ్ నం. 29/2021 కింద అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఐపీసీలోని సెక్షన్లు120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు.