Cantonment board Elections..ఓట్ల తొలగింపు హక్కులను హరించడమే:KTR

Cantonment board   Elections..ఓట్ల తొలగింపు హక్కులను హరించడమే:KTR

 

కంటోన్మెంట్‌ ఓట్ల 

తొలగింపుపై రక్షణ

మంత్రికి కేటీఆర్‌ లేఖ

ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఐదు సంవత్సరాలలో ఓటర్ల సంఖ్య తగ్గిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ వీరికి ఎన్నికల్లో పాల్గొని హక్కు కల్పించాలని కోరారు. కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 35వేల మంది పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని ఓట్ల జాబితా నుంచి తొలగించారన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా.. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు

తొలగించిన ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా, వారికి రాజ్యాంగం కలిగించిన ఓటు హక్కును దూరం చేయడం అక్రమమన్నారు. బోర్డ్‌కు, విద్యుత్ శాఖకు, వాటర్ సరఫరా శాఖలకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులను చెల్లిస్తూ వస్తున్నారన్నారు. గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వీరి హక్కులను హరించేలా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిందన్నారు. అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సాహేతుకంగా లేదని అన్నారు. ఇప్పటిదాకా దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు అక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదన్నారు.

అక్రమ నివాసమని రుజువులు లేకుండానే..

తొలగించిన ఓటర్లను అక్రమంగా నివాసం ఉంటున్నారని రుజువు చేయకుండానే, నేరుగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయమన్నారు. 2018 లో 1,91,849 ఓటర్లు ఉంటే ఈ రోజు వారి సంఖ్య 1,32,722 కు తగ్గడం దురదృష్టకరమన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చేపడుతున్న ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల వలన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గత ఐదు సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలోని పౌరుల సంఖ్య పెరగకుండా తగ్గిందన్నారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35వేలమంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు..

administrator
WWW.AMNINDIA.COM

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *