TT Ads

తెలంగాణలో కామ్రేడ్లు రగిలిపోతున్నారు. కేసీఆర్ మ‌మ్మ‌ల్ని ఘోరంగా అవమానించారని, వాడుకుని వదిలేశారని ఫైర్ అవుతున్నారు. కేసీఆర్‌కు మా త‌డాక ఏమిటో చూపిస్తామంటూ ఎర్ర జెండా సాక్షిగా… వామపక్షాల నేత‌లు శ‌ప‌థం చేస్తున్నారు. ఈనేప‌ధ్యంలో హైదరాబాద్‌లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపి పైన‌ల్ గా బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని, కాంగ్రెస్ తో జత కట్టి బీఆర్ఎస్‌ కు ఓటమి రుచి చూపించాలని భావిస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతు కోసం త‌మ‌ను ప్రగతి భవన్‌కు పిలిచి మర్యాదలు చేసిన కేసీఆర్, ఇప్పుడు త‌మ‌ని పట్టించుకోలేదని వామ‌ప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత ప్రగతి భవన్ గేట్లు కమ్యూనిస్టులకు ఓపెన్ కాలేదనే వినికిడి. చాలా సార్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినా వారికి అధినేత కేసీఆర్ రెస్పాండ్ కాలేద‌ని సమాచారం. పొత్తులపై ఏదో ఒక్కటి తేల్చండి.. మా దారి మేము చూసుకుంటామని గత నెల నుంచి సీపీఐ, సీపీఎం నేతలు బహిరంగంగా మొత్తుకున్న అక్క‌డి నుంచి వారికి ఎలాంటి సిగ్న‌ల్స్ రాలేదనే స‌మాచారం. కానీ చివరికి పొత్తు లేదని అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారికి కేసీఆర్ నో ఎంట్రి బోర్డ్ పేట్టేశారు.

రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం రకార‌కాల ప్లాన్స్ అనుసరిస్తుంటాయి. కాని ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్న తర్వాత దానిని సాధించే వరకు ఆ బంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ఈ మిత్రధర్మాన్ని తప్పాయ‌ని బీఆర్ఎస్ వర్గాల ఆరోప‌ణ‌. ఒకవైపు తెలంగాణ‌లో బీఆర్‌ఎస్‌తో స్నేహం చేస్తున్నామని చెప్తూనే మరోవైపు ఢిల్లీలో కొత్త కూటమిలో చేరి మోసం చేశాయని వారి వాద‌న‌. ఒక జాతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌తో పొత్తులో ఉండగానే మరో జాతీయ పార్టీతో చేతులు కలిపాయి. అందుకే సీఎం కేసీఆర్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేత‌లు వివ‌రిస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ మిత్రధర్మం పాటించని లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు ఉండబోదని ప్రకటించారు. దీంతో తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు లెఫ్ట్‌ పార్టీల నేతలు త‌మ అధినే పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

దేశాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీలే పాలిస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ఉన్న దరిద్రానికి ఆ పార్టీలే కారణమని కేసీఆర్‌ పదేపదే చెప్తున్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయ‌న డిసైడ్ అయ్యారు. దేశంలో త‌న‌తో కలిసొచ్చే పార్టీలతో స్నేహం చేస్తామని ప్రకటించారు. సీపీఐ, సీపీఎంతో కూడ అందులో భాగంగా స్నేహాన్ని కొనసాగించారు. కానీ, రెండు లెఫ్ట్‌ పార్టీలు మిత్రధర్మాన్ని మరిచాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త కూటమిలో చేరాయి. కనీసం ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను సంప్రదించలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆ రెండు పార్టీలను పక్కనపెట్టేశారని బీఆర్ఎస్ నేత‌ల ఆరోప‌ణ..

ఇప్పుడు తమను మోసం చేశారంటూ ఆ రెండు పార్టీల నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి వాపోతున్నారు. దీంతో లెఫ్ట్‌ పార్టీల నేతలపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతునారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి, వెన్నుపోటు పొడిచి, కొత్త కూటమిలో చేరడాన్ని ఏమంటారో చెప్పాలని నిలదీస్తున్నారు. తమ పొత్తు రాష్ట్ర స్థాయికే పరిమితం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని సైతం ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎక్క‌డ గాలి ఉంటే అక్క‌డి పాట‌పాడే విధంగా పొత్తుల పేరుతో బలమైన పార్టీలకు దగ్గరవడం, మరో పార్టీ కనిపించగానే అవకాశవాదంతో అటువైపు వెళ్లిపోవడం లెఫ్ట్‌ పార్టీలకు కొత్తేమి కాదని బీఆర్ఎస్ నేత‌లు మండిపడుతున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉంటందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయింది. దక్షిణ తెలంగాణలో తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు.కానీ కేసీఆర్ కమ్యూనిస్టుల్ని వద్దనుకున్నారు.

పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు.

కామ్రేడ్ల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపునకు మళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు హస్తం పార్టీతో జతకట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కలసి రావాలని కాంగ్రెస్ కోరినా..బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్ కే సాధ్యమని ప్రకటనలు చేసి.. బీఆర్ఎస్ తో వెళ్లారు. ఇప్పుడు రెండు వామపక్షాలు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.

కాంగ్రెస్ తో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనే అభిప్రాయాన్ని రెండుపార్టీల నేతలూ వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఓడించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటిగా చేసుకున్నారు. అందుకే త‌మ‌ను అవ‌మానించిన బీఆర్ఎస్ పార్టీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని డిసైడ్ అయ్యారు కామేడ్రులు…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *