26.7 C
Hyderabad
Tuesday, May 28, 2024

కాంగ్రెస్ గూటికి గులాబీ నేతలు..!

Must read

పార్లమెంట్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్‌లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే పనిలో పుల్ బీజీగా వుంది. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ కు అన్నీ వరుస షాక్‌లే తగులుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. దీంతో సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ.. క‌డుతున్నారు.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని చేయ్యి అందుకోవాటానికి రెడీగా ఉన్నారు.. కారులో ఉన్నగూలాబీ నేత‌లు ఒక్కోక్క‌రుగా దిగిపోవ‌టంతో ఖాళీ అవుతున్న తీరును చూసిన నేత‌లు కారు అండ‌ర్ రిపేర్ అనే బోర్డ్ పెట్టుకొవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీని వీడి వెళ్తుండడంపై బీఆర్‌ఎ్‌సలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం బీఆర్‌ఎ్‌సలో ఉన్న మిగతా నేతల్లోనూ పార్టీ మారాలనే ఆలోచన మొదలైందని, ఇందుకోసం వారితో టచ్‌లో ఉన్న అధికార పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. నిన్నమొన్నటి వరకు ఓవర్‌లోడ్‌తో కిక్కిరిసిపోయిన ‘కారు’ ఇప్పుడు ఇలా క్రమంగా ఖాళీ అవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి.. చేయి అందుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే యాదయ్యతో మంతనాలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. అయితే.. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు యాదయ్య చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఏదో మతలబు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలుస్తుండటంతో బీఆర్ఎస్‌కు గుడ్‌ బై.. చెప్పేసి చేతిలో చేయ్యి వేసి గూలాబీల గూటి నుంచి హస్తం గూటికి వచ్చేస్తున్నారనే సంకేతాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలవడం.. ఇప్పుడు యాదయ్య కలవడం ఇవన్నీ చూస్తుంటే.. కారుకు కౌంట్ డౌన్ స్టార్ట్‌ అయిన‌ట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వరుస భేటీలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ సునామీ సృష్టిస్తోంద‌ని రాజ‌కీయ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యేలు చేరుతుండగా.. ఎంపీలంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్లోకి గులాబీ పార్టీ నేతలంతా వచ్చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ ఎలా ఉంటుందో అని బీఆర్ఎస్ వర్గాల్లో ఒకింత కలవరం మొదలైంది. మరోవైపు.. బీఆర్ఎస్ కచ్చితంగా ఖాళీ అవుతుందని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కొందరు మంత్రులు పదే పదే మీడియా ముందుకు వచ్చి చెబుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు ముందు చెప్పినట్లుగానే.. ‘కారు’ పార్టీ కొంచెం కొంచెం ఖాళీ అవుతూనే వస్తోంది. తాము అన్ని గేట్లు ఎత్తితే బీఆర్‌ఎస్‌ నాయకులందరూ తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వెళ్లిపోతే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టతరంగా మారుతుంది. మరోవైపు పార్టీ మారకుండా ఉన్నవారైనా పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తారా? అని కూడా బీఆర్‌ఎ్‌సలో చర్చ జరుగుతోంది. కారు సర్వీసింగ్‌కు వెళ్లిందని, సర్వీసింగ్‌ అయి మళ్లీ బయటకు వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంటుండగా.. కారు షెడ్డు నుంచి బయటకు వచ్చినా.. అందులో ఎక్కేందుకు ఎవరూ ఉండరని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరగా, తాజాగా వరంగల్‌ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వీరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాలను వదులుకుని పార్టీని వీడడం, వీరినే కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండడంతో ఇంకా ఎవరెవరు వెళతారోనన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై.. అధికారం కోల్పోయేసరకి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలెవరూ స్వతంత్రంగా, సంతోషంగా ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఎవరికైనా టికెట్‌ ఇచ్చినా నామినేషన్‌ వేసేవరకు పార్టీతోనే ఉంటారన్న నమ్మకమూ లేకుండా పోయింది. పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులే కాంగ్రె్‌సలోకి జంప్‌ అవుతుండడంతో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎంపీ అభ్యర్థులే కాకుండా.. పార్టీ సీనియర్‌ నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసినవారు, సిటింగ్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. తాజాగా కె.కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీ మారడం ఖాయమైంది. అయితే వీరు బహిరంగంగా పార్టీ మారుతుండగా.. లోలోపల ఇంతకంటే పెద్ద వ్యవహారమే జరుగుతోందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారితే చట్టపరంగా ఇబ్బందిలేని సంఖ్యలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరతారని చెప్పకనే చెబుతున్నారు. తమతో 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా చెబుతున్నారు.

తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని.. వారు తప్పు తెలుసుకుంటారన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రెండు కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ రెండు శాతం తేడా ఓట్ల సిద్దాంతాన్ని చెబుతున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. బీఆరెస్‌ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతున్నది. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణలో కనీ వినీ ఎరుగని అభివృద్ధి చేశామని అయినా ప్రజలు ఓడగొట్టారని .. వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ చానళ్లు పెట్టుకున్నా గెలిచేసేవారమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తూంటే… ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగానే అర్థమవుతుంది. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంత మంది నేతలకు ఓటమి అనేదే ఉండకూడదు. అయినా వారెవరూ తాము అభివృధ్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అది రాజకీయం. ప్రజాస్వామ్య రాజకీయాలు అంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు.. ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్ లను వద్దనుకోవడానికి .. అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ కు మేలైన మార్కులు వేస్తారు. అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ చానళ్లు పెట్టులేకపోవడం కాదు. ఎందుకంటే.. కాంగ్రెస్ కు పది శాతం మీడియా.. ఆన్ లైన్ మీడియా సపోర్ట్ ఉంటే.. మిగతా 90 శాతం బీఆర్ఎస్‌కే ఉంది.

సామాన్యుడి నుంచి సకల భోగాలు అనుభవించిన వ్యక్తిదాకా ఎవరైనా కన్న తల్లిని పుట్టి పెరిగిన ఊరిని తలచుకుంటారు చివరి దశలో అక్కడికి చేరుకోవాలని తపిస్తారు, తెలంగాణా రాజకీయాల్లో తలపండిన నేత డా. కె.కేశవరావుకు అలా అనిపించడంలో తప్పేమీ లేదు. ఆయనకు కొంత ఆలస్యంగా ఎనభై నాలుగేళ్ల వయసులో ఈ విషయం బోధపడింది. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆయన కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి తెలంగాణా తల్లిని ఆవాహన చేసుకున్నారు. నిజానికి కేశవరావు మొదటినుంచీ తెలంగాణాకోసం మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీలో అదే ఆయనకు గుర్తింపు, గౌరవం, పదవులు రావడానికి కారణం అయ్యింది. ఎన్నడూ ప్రజాక్షేత్రంలో లేకపోయినా, ప్రత్యక్షంగా శాసనసభకు ఎన్నిక కాకపోయినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది. తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టిన వారినీ, ఆ తరువాత టీఆర్‌ఎస్‌ పుట్టిన నాటినుంచీ పనిచేసిన అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కాదని కేసీఆర్ ఎందుకోగానీ కేకేను గట్టిగా నమ్మారు. చనిపోయేముందు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని అనుకుంటున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇది ఒక్క కేకే విషయంలోనే కాదు. గతంలో ధర్మపురి శ్రీనివాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. తెలంగాణా ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు కూడా. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు. తీరా 2014లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిందే తడవుగా కేసీఆర్ ఆయనను రాజ్యసభకు పంపించారు కానీ ఆయనకు కూడా నాలుగేళ్లు తిరగక ముందే కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వచ్చి రాజీనామా చేయకుండానే ఆ వొడిలో వాలిపోయారు. అప్పుడు ఆయన చెప్పిన మాటే ఇప్పుడు కేకే కూడా చెపుతున్నారు. దానం నాగేందర్ కూడా దాదాపు అదే చెపుతున్నాడు. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ పాత కాపులకు దక్కిన మర్యాద, మన్నన కేసీఆర్ దగ్గర ఉద్యమకారులకు కూడా దక్కలేదన్నది వాస్తవం.

భారతదేశంలో ప్రజలు ఎవరికయినా సరే శాశ్వతంగా విధేయులుగా ఉండరు. ఇది ఇప్పుడే కాదు. గతంలో ఇండియాకు తానే ప్రతిరూపం అనుకున్న ఇందిరా గాంధీ, తెలుగుజాతికి స్ఫూర్తి దీపం అనుకున్న ఎన్‌టీ.రామారావుకు కూడా చరిత్రలో ప్రజలు ఇలాంటి పాఠాలు చెప్పారు. ఆ అనుభవాలను కూడా కేసీఆర్ ఆకళింపు చేసుకోలేక పోయారు. నమ్మాల్సిన వారిని నమ్మకపోవడం, అసలే నమ్మగూడని వారిని అందలం ఎక్కించడం కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించేది. అది ఆయనకు, ఆయన పార్టీకే కాదు తెలంగాణాకు కూడా చాలా నష్టం కలిగించింది. కోదండరాం విషయమే తీసుకుందాం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రోది చేసిన విద్యావంతుల వేదిక నుంచి మొదలై, టీఆర్‌ఎస్‌కు తిరుగులేని పౌరసమాజ బలాన్ని సమకూర్చి, రాజకీయ ఐక్యకార్యాచరణలో కలిసి నడిచిన ఆయనను, ఆయన లాంటి అనేకమందిని అనుమానించి దూరం చేసుకున్నాడు. పది ఇరవై ఏళ్లుగా తెలంగాణా కోసం పనిచేసిన అనేకమంది మేధావులు, బుద్ధి జీవులు, ప్రజాసంఘాల నాయకులు, దళితులు, ముస్లింలు, మహిళలు, ఆదివాసీ బిడ్డలు, అటుకులు బుక్కీ, అంబలి తాగి పోరాటంలో నిలబడ్డ వాళ్ళు తెలంగాణా పునర్నిర్మాణంలో భాగస్వాములు కాలేకపోయారు.

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా అప్పుడు అధికారంలో, పదవుల్లో, ఆంధ్ర పార్టీలతో అంటకాగిన వాళ్ళు తెలంగాణలో మంత్రులై , అధికారులే ఆధిపత్యం చెలాయించారు. దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి చివరకు కడియం శ్రీహరి లాంటి అనేకమంది అయాచితంగా అధికారం చెలాయించారు. నిజానికి కడియం శ్రీహరి చివరంటా చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి నేరుగా ఉపముఖ్యమంత్రి కాగలిగారు. ఎంపీగా, ఎంఎల్సీగా, ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు పొందారు. చివరకు తన కూతురికి కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కానీ ఆయన విధేయత చూపలేదు సరికదా ఇప్పుడు ఉన్నట్టుండి ఎదురుతిరిగారు. వ్యక్తిగతంగా అంతో ఇంతో విలువలతో బతికిన శ్రీహరి గారికి జీవిత చరమాంకంలో కూతురు భవిష్యత్తు ముఖ్యమని అనిపించింది. మంద కృష్ణ చెప్పినట్టు ఆయన ఒక్కడి వల్ల అక్కడ కనీసం నలుగురైదుగురు నాయకులు నష్టపోయారు. కేవలం కేసీఆర్ గుడ్డి నమ్మకం వల్లనే ఇదంతా జరిగింది అనే వాళ్ళూ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. ఇలాంటి అంచనాలు తప్పడం మూలంగా ఇప్పుడు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నమ్మాల్సిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, నయాన్నో భయాన్నో కాపాడుకోవాల్సిన ఈటెల రాజేందర్‌ను కాపాడుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.

నిజానికి కేసీఆర్ అపరచాణక్యుడని ఇప్పుడు పార్టీ వీడుతున్న వారితో సహా చాలామంది అంటుంటారు కానీ అది ఉట్టి ప్రచారం అని తేలిపోతోంది. తెలంగాణాలో ఒక తిరుగులేని అస్తిత్వ శక్తిగా ఉండి తెలంగాణా సాధనను సాకారం చేసి, పదేళ్ల పాటు తెలంగాణా రాష్ట్రాన్ని తిరుగులేకుండా తీర్చిదిద్దామని చెప్పిన పార్టీ ఇప్పుడు దిక్కుతోచని దయనీయ స్థితిలో పడిపోయిందంటే కేసీఆర్ రాజకీయ చాణక్యం పనిచేయడం లేదని అర్థం అవుతోంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకోగానీ కేసీఆర్ తనకు తిరుగులేదని అనుకున్నారు, తన మాటే శాసనం అనుకుని ప్రజల మనసులో ఏముందో గుర్తించలేకపోయారు. పద్నాలుగేళ్ల పాటు ప్రజల్లో ఉండి నడిపించిన నాయకుడు ప్రజల ఆలోచనలను గమనించలేక దూరమయ్యాడు. పార్టీ నిర్మాణం కూడా అవసరం లేదనే అభిప్రాయంలో తెలంగాణా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణా అన్న ధోరణిలోకి వెళ్లారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో సంబంధం లేకపోవడం, పరిపాలన మీద పట్టు సడలడంతో పాటు ఇదంతా అహంకారం, దొరతనం, కుటుంబ ఆధిపత్యం అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీని పదవిలోకి రాకుండా చేసింది. నిజానికి ఎన్నికల ప్రచారం నాటికి అవినీతి, అభివృద్ధి జరుగలేదనే విమర్శ పెద్దగా లేదు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కథనాలేవీ అప్పటికి బయటపడలేదు. అయినా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు. ఆ విషయాన్ని ఇప్పటికీ ఆ పార్టీ నమ్మడం లేదు.

ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పోటీ మొత్తం బీఆర్ఎస్ వెర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్, సునీతా రెడ్డి, చేవెళ్లలో ప్రత్యర్థులుగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి బీఆర్‌ఎస్ తీర్చిదిద్దిన నాయకులే. రేపు వరంగల్ బరిలో కూడా ముగ్గురూ బీఆర్‌ఎస్ మూలాలనుంచి వచ్చిన వాళ్ళే పోటీ పడబోతున్నారు. ఆదిలాబాద్, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్ పోటీ పడుతున్నది పాత టీఆర్ఎస్ నేతలతోనే. వీళ్లంతా నాయకుడి అవిశ్వాసం వల్ల మాత్రమే బయటకు వెళ్లారు. ఈటెల, విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, బూర నర్సయ్య, సీతారాం నాయక్ వంటి తెలంగాణా ఉద్యమంలో ఉన్న వాళ్ళను ఒకరకంగా బలవంతంగా బయటకు పంపారు. ఇది ఇప్పుడు మొదటికే మోసం వచ్చే విధంగా తయారయ్యింది.

రాజకీయాల్లో నిజానికి పార్టీ శ్రేణులకు అనుగుణంగా నడుచుకోవాలి. నాయకత్వం ప్రజాస్వామికంగా ఉండాలి. ఎదిగి వచ్చిన నాయకులను గౌరవించాలి. వారి శక్తి సామర్థ్యాలు గుర్తించాలి. మరోవైపు సిద్ధాంత ప్రాతిపదికన ఎదిగి నిలదొక్కుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేసింది, రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరిన నాలుగేళ్లలో అక్కడ నాయకుడు కాగలిగాడు. అవసరాన్ని గుర్తించిన పార్టీ నలభై ఏళ్లుగా ఉన్న వాళ్ళను కూడా పక్కకు నెట్టి ఆయనను కూర్చోబెట్టి తెలంగాణలో నిలదొక్కుకోగలిగింది. భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాన్ని తాను ప్రోది చేసుకుంటూనే నడిసొచ్చిన నేతలందరినీ తనలో కలుపుకుంటూ విస్తృతం అవుతోంది. ఈటెల రాజేందర్‌కు ఆ పార్టీ ఇస్తోన్న ప్రాధాన్యమే దానికి ఉదాహరణ. బీఆర్ఎస్‌లో ఈ రెండూ లోపించడం వల్లే ఇవాళ దూదిపింజలా తేలిపోతోంది. చాణక్య నీతి అంటే బలహీనుడైన శత్రువుతో స్నేహం చేసుకోవడం తప్ప బలహీనులను శత్రువులు చేసుకోవడం కాదు. అలా అయిన వాళ్లందరినీ బలహీనులని వదిలేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి. నిజానికి బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో ఇంకా బలంగానే ఉంది. కొన్నిచోట్ల తన ప్రత్యర్థులకంటే కూడా. కానీ నాయకత్వం నైరాశ్యంలో పడిపోతోంది. రాజకీయాల్లో ఓడిపోతున్నామని తెలిసినా పోరాడి తీరాలి. గెలుస్తామన్న భరోసా శ్రేణులకు కలిగించాలి. ఈ విషయం తెలంగాణా ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌కు బాగా తెలుసు. కానీ ఆయన ఎందుకో అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అది కేవలం ఆ పార్టీకే కాదు. తెలంగాణాకు కూడా నష్టం. బీఆర్ఎస్ ఉనికిలో ఉండడం తెలంగాణ అవసరం. లోక్‌సభ స్థానాల వారీగా చేస్తున్న సమీక్షా సమావేశాల సందర్భంగా అగ్రనేతల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి… ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం సమీక్షకు ఆహ్వానించిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఏ మాత్రం ప్రయత్నించడంలేదు. దీంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ లో అసహనం పెరిగిపోతోంది. పరిస్థితి దిగజారిపోతూంటే.. కేటీఆర్ సమీక్షల పేరుతో పిలిచి .. ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపించేస్తూండటంతో చాలా మంది నిరాశతో వెనుతిరుగుతున్నారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశాలను నిర్వహించారు.

అభ్యర్థులు, ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. కానీ అసలు సమీక్ష అంటూ ఏమీ జరగలేదు. ఎంపీ స్థానంలో బలాబలాలేంటి..? బలహీనతలేంటి..? గతంలో జరిగిన పొరపాట్లేంటి..? వాటిని ఇప్పుడు ఎలా అధిగమించాలి..? స్థానిక నేతల మధ్య సఖ్యత ఉందా? లేదా? లేకపోతే వారిని ఎలా సమన్వయం చేయాలి..? ప్రత్యర్థులు, వారి పార్టీల స్థితిగతులేంటి..? ఇలా సమస్యలను గుర్తించి పరిష్కరించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాలి. కానీ కేటీఆర్ అసలు ఇదంతా పనికి రాని వ్యవహారం అనుకుంటున్నారు. అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన ఒకరిద్దరు నేతలు మాట్లాడటం, ఆ తర్వాత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో మాట్లాడించి, వెంటనే సమావేశాన్ని ముగింపజేయటం పరిపాటిగా మారింది. కేటీఆర్ ప్రధానిపైనా, ముఖ్యమంత్రిపైనా నోరు పారేసుకోవటం, దుర్భాషలాడటం చేస్తున్నారు. అవి మీడియాలో హైలెట్ కావొచ్చు కానీ.. ఎన్నికల్లో ఎలా ఉపయోగపడతాయని క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల సభల్లో అలాంటి విమర్శలు చేసుకోవచ్చు కానీ.. సమీక్షల్లో చేయాల్సిన అవసరం ఏమిటనేది సమావేశాలకు హాజరయ్యే వారికీ అర్థం కావడం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక వెలుగు వెలిగింది. ఒక దశలో భవిష్యత్తులో కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారనే ప్రచారాన్ని ఊదరగొట్టింది. అంతేకాదు ‘దేశ్‌ కీ నేత’ అంటూ కేసీఆర్‌ పేరును ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజల సొమ్ము (ప్రభుత్వ పథకాల ప్రకటనలతో)తో పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఫలితంగా రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దరిమిలా బీఆర్‌ఎ్‌సలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్నవారే మొదటగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోగా.. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ పునరేకీకరణ పేరుతో పార్టీ ఫిరాయింపులను కేసీఆరే ప్రోత్సహించడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‘నీవు నేర్పిన విద్యయే కదా’ అంటూ నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది. ఫిరాయింపులను నిలువరించలేక, నేతలకు ధైర్యాన్ని చెప్పలేక బీఆర్‌ఎస్‌ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎ్‌సకు చివరికి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సహా పలు అవినీతి ఆరోపణలే పార్టీకి మిగిలాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఫలితాలు తేడా వస్తే పార్టీ ఉనికిపైనే ప్రభావం చూపుతుంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తరవాత లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే కోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. ప్రజలే తప్పు చేశారని అనుకుని.. వారు పశ్చాత్తాప పడతారని భావిస్తూ ఆత్మవంచన చేసుకుంటే.. ఇంకా ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేస్తున్నారు. ఎలాంటి ఫలితమైన బీఆర్ఎస్ నాయకత్వం తీసుకునే చర్యలను బట్టే ఉంటుందనుకోవచ్చు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article