TT Ads

బెంగళూరు: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ (Foxconn) కర్ణాటకలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. సుమారు 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో యాపిల్‌ (Apple) ఫోన్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుందని బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది. వాషింగ్టన్‌- బీజింగ్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాలు తరలించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ప్లాంట్‌ వల్ల లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కర్ణాటకలో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోందని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు. దీనివల్ల లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఫాక్స్‌కాన్‌ నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యంగ్‌ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణను కలిసింది. ప్లాంట్‌ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని ఈ బృందం పరిశీలించినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. అంతకుముందు ఇదే బృందం గురువారం తెలంగాణలో పర్యటించింది. తెలంగాణలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

బెంగళూరులో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌లో ఐఫోన్లు తయారు చేయడంతో పాటు మరికొన్ని యాపిల్‌ ఫోన్ల అసెంబుల్‌ చేయనున్నారు. ఇందులోని కొంత భాగాన్ని విద్యుత్‌ వాహనాల వ్యాపారానికి ఫాక్స్‌కాన్‌ వినియోగించనుందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉంది. అయితే, కొవిడ్‌ వేళ తలెత్తిన సప్లయ్‌ చైన్‌ అవరోధాలను దృష్టిలో పెట్టుకుని యాపిల్ సహా మరిన్ని అమెరికా సంస్థలు చైనాలోని తమ తయారీ కార్యకలాపాలను అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా యాపిల్‌ ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ భారత్‌లో తయారీకి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఝంగ్జౌ నగరంలో యాపిల్‌ ఫోన్ల తయారీ ప్లాంట్‌లో 2 లక్షల మంది పనిచేస్తున్నారు. భారత్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌ చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కానుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *