TT Ads

*ఆయుష్‌ ఔషధాల ప్రమాణాల నియంత్రణకు చర్యలు
రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13: ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ఆయుష్‌ శాఖ మంత్రిని ప్రశ్నించారు. 2025 నాటికి ఆయుష్ ఔషధాల ఎగుమతులను 23 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆయుర్వేద ఔషధాలు ప్రభావశీలంగా, ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నియంత్రించి వాటిని సర్టిఫై చేసేందుకు ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు జరుపుతున్నదో వివరించాలని కూడా ఆయన కోరారు.
ఈ ప్రశ్నలకు ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ మహేంద్రబాయ్‌ జవాబిస్తూ ఆయుష్‌ ఔషధాలను జీఎంపీ (గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్టిఫికెట్‌) నిర్దేశించిన ప్రమాణాల మేరకే తయారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు బయో మెడికల్‌ ప్రాడక్ట్‌గా సర్టిఫికెట్‌ పొందాల్సి కూడా ఉంటుందని తెలిపారు. ఆయుర్వేద ఉత్పాదనలు ఆయుష్‌ ప్రీమియం మార్క్‌ పొందడానికి క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సర్టిఫికెట్‌ సైతం అవసరం ఉంటుందని చెప్పారు. ఆయుష్‌ ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు థర్డ్‌ పార్టీ సర్వేల ద్వారా వాటి నాణ్యతను పరీక్షించడం జరుగుతుందని చెప్పారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *