
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ఏడుగురు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జ్ సుభాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 27 ఫిబ్రవరి 2017న ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతోపాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది
ఈ ఏడాది జూలై 6న కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువును మంత్రి ఉషశ్రీ చరణ్ కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
100 ఎకరాల చెరువును పూడ్చి, ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమమహేశ్వరరావు తన పిటిషన్లో తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారాయన. దీనిని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. కళ్యాణదుర్గం లోని సర్వే నెంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని కబ్జా చేశారని ఆ పిటిషన్లో తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఆర్టీవో లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రెండు వారాల్లో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం గతం లో ప్రభుత్వాన్ని ఆదేశించిది.