
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు.ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకుంది.
ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌పై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశాక మరిన్ని సెక్షన్లు నమోదు చేయనున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెసర్ పోలీసుల అదుపులో ఉన్నారు.వర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు భగ్గుమన్నారు
. దుశ్చర్యకు పాల్పడిన ప్రొఫెసర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ గేటు ఎదుట ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు
. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆచార్యులే దారుణాలకు పాల్పడితే ఇంకెవరికి చెప్పాలంటూ పలువురు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ యాజమాన్యం స్పందించి ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకునేంత వరకు అందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.