గుంపుగా వచ్చిన…. సింగల్ గా వచ్చిన… తగ్గేదె లే ..!

0
6

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది.
వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్ పేరుతో కేంద్రం ఏన్నిక‌ల కద‌న రంగంలోకి దూకుతోంది. అందుకే ఎన్నికలు విషయంలో.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెల‌కొంది. డిసెంబర్‌లోగా జ‌ర‌గాల్సిన‌ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలపై కేంద్రం వెనకడుగు వేస్తోంది. దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో రాజకీయ పార్టీలను గందరగోళ పరిచి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ కుట్ర చేస్తోంది. అయిన తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం ఖాయం, దేనికైనా రెడీ అంటూ బిఆర్ ఎస్ నేత‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జ‌మిలి ఏన్నిక‌ల సాధ్యాసాధ్యాలపై.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఇప్పటికే కమిటీ వేసింది మోడీ సర్కార్‌. ఈనెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కమిటీ ఇచ్చే నివేదికను సభలో పెట్టబోతుందని సమాచారం. అయితే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. దీంతో జమిలీ సాధ్యం కాకపోతే… మినీ జమిలీ ఎన్నికలు అయినా నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందట. మినీ జమిలి అయితే… అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని మోడీ సర్కార్‌ భావిస్తోంది. మినీ జమిలి కూడా జనవరి, ఫిబ్రవరిలో కాదు.. ఏప్రిల్, మేలో జరగొచ్చనే అంచనా వేస్తోంది కేంద్ర స‌ర్కార్‌.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని పార్లమెంట్ తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామేంట్స్ ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హ‌ట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టీ వ‌ర‌కు ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేదే జ‌ర‌గ‌లేదు. ఇప్పుడున్న అసెంబ్లీ పదవి కాలం పూర్తయ్యే లోపు కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇప్ప‌టీ వ‌ర‌కు ఎన్నికలు నిర్వహించలేని సందర్భమే లేదు.. కానీ ఈ సారి జమిలీ ఎన్నికల ఆలోచనలో ఉన్న కేంద్రం.. మొదటి సారి మినీ జమిలీకి ప్లాన్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీంతో ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి మరీ డిసెంబర్ లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఆలస్యం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి ఏమిటన్నది దానిపై అప్పుడే గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది.

మినీ జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే.. ఎన్నికలు మేలో జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం జనవరి రెండో వారానికి ముగిసిపోతుంది. మరి ఎన్నికలు జరిగే మే వరకూ ఏ ప్రభుత్వం పాలన చేస్తున్నారు. అసలు ప్రజాప్రతినిధులే ఉండరు కాబట్టి.. ప్రభుత్వం అనే మాటే రాదు. ఆపద్ధర్మ సీఎం అనే మాట వినిపించే అవకాశం లేదు. అలాగని.. ప్రభుత్వాన్ని మరికొంత కాలం పొడిగించే చాన్స్ అసలు లేదు. రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ఏమైనా మార్పులు చేస్తే.. అప్పుడు అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణ ద్వారా పొడిగించడం ఎలా సాధ్యమన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఐదేళ్ల పదవీ కాలానికి మాత్రమే ప్రజలు ఓట్లేశారు. అంతకు మించి పదవిలో ఉండటానికి రాజ్యాంగం అంగీకరించదు.

ఇలాంటి పరిస్థితి వస్తే ఎక్కువగా అవకాశం ఉన్న చాయిస్..రాష్ట్రపతి పాలన. సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రయోగాలు చేయకపోయినా.. ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం ఐదు రాష్ట్రాల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే రాష్ట్రపతి పాలన విధించడం అనేది చాలా తేలికైన ఆప్షన్. అందుకే రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా.. సమస్యను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. ఇది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణ, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్ర పాలన వచ్చినట్లే. ఎన్నికలకు ఇది అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాల్లో ఉంది బీజేపీ స‌ర్కార్.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తెలంగాణ, మిజోరం, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే… 2024లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా 12 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే… డిసెంబర్‌లోగా జరగాల్సిన తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాదిలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు నిర్వహించొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదంటే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలనే ముందుగా జరపొచ్చని భావిస్తోంది కేంద్ర స‌ర్కార్.

ప్రభుత్వాల పదవీ కాలాన్ని పొడిగిస్తే.. బీఆర్ఎస్ జమిలీ ఎన్నికల విషయంలో ఇష్టం లేకపోయినా… అంగీకరించే అవకాశం ఉంది. కానీ.. రాష్ట్రపతి పాలన విధిస్తామంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. కేసీఆర్ సీఏంగా లేరు అన్న ఊహను కూడ‌ బీఆర్ఎస్ వర్గాలు త‌ట్టుకోలేవు. అధికార పగ్గాలు కేసీఆర్ చేతుల్లో లేకుండా ఐదారు నెలలు కేంద్ర పాలన సాగిందంటే ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని భావిస్తుంది బీఆర్ఎస్. అందుకే రాష్ట్రపతి పాలన తర్వాత ఎన్నికలంటే బీఆర్ఎస్ ఒప్పుకునే అవకాశం లేదు. దీన్ని కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది.

జమిలీ ఎన్నికలపై తెలంగాణ నేతలు కూడా లీకులు ఇస్తుండటంతో… అదే జరగొచ్చని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయా లేదా అన్నదానిపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎన్నికలు సమయానికి జరిగినా… ఆలస్యమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ కూడా ఇప్పటికే పార్టీ నేతలకు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్లు సమాచారం. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో జమిలీ ఎన్నికలే హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీకి అధికారం ఉంది. మెజార్టీ ఉంది. అందుకే తాను చేయాలనుకున్నది పక్క‌గా చేస్తోంది అన్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొన‌సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here